Narayanpet: శిక్షణలో ప్రతి అంశాన్ని ఆసక్తిగా నేర్చుకోవాలి: జిల్లా ఎస్పీ డా. వినీత్!

Narayanpet: నారాయణపేట జిల్లాలో 6 నెలల ప్రాక్టికల్ శిక్షణకు వచ్చిన ముగ్గురు ట్రైనీ డీఎస్పీలు జిల్లా ఎస్పీ డా. వినీత్‌ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

P.HANMANTHU, NARAYANAPETA
Published on: 23 Nov 2026 8:53 PM IST
Narayanpet
X

Narayanpet: శిక్షణలో ప్రతి అంశాన్ని ఆసక్తిగా నేర్చుకోవాలి: జిల్లా ఎస్పీ డా. వినీత్!

నారాయణపేట జిల్లా: పోలీస్ శాఖలో శిక్షణ అనేది భవిష్యత్తులో సమర్థవంతమైన పోలీస్ అధికారులుగా ఎదగడానికి ఎంతో కీలకమని, శిక్షణలో భాగంగా ప్రతి అంశాన్ని ఆసక్తిగా నేర్చుకొని పోలీస్ విధులు, బాధ్యతలపై పూర్తి అవగాహన పెంచుకోవాలని జిల్లా ఎస్పీ డా. వినీత్ ట్రైనీ డీఎస్పీలకు సూచించారు.

పోలీస్ శాఖ శిక్షణ కార్యక్రమంలో భాగంగా ప్రాక్టికల్ ట్రైనింగ్ కోసం నారాయణపేట జిల్లాకు కేటాయించబడిన ముగ్గురు ట్రైనీ డీఎస్పీలు 1) దైనంపల్లి ప్రవీణ్ , 2) బానోతు శ్రీనికేష్ నాయక్, 3) పూజారి అనురాగ్ సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ డా. వినీత్ ను మర్యాదపూర్వకంగా కలిసి 6 నెలల శిక్షణ నిమిత్తం రిపోర్ట్ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వారికి జిల్లాలోని వివిధ పోలీస్ విభాగాలు, వాటి విధులు, బాధ్యతలు, పోలీస్ శాఖ పనితీరు గురించి వివరించారు. శిక్షణలో భాగంగా పోలీస్ స్టేషన్ల నిర్వహణ, కేసుల నమోదు, దర్యాప్తు విధానం, నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం వంటి అంశాలను క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించి నేర్చుకోవాలని సూచించారు.

ప్రతి పోలీస్ అధికారి విధి నిర్వహణలో చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండటంతో పాటు, పరిస్థితులకు అనుగుణంగా సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని తెలిపారు. శిక్షణ సమయంలో సీనియర్ పోలీస్ అధికారుల అనుభవాలను తెలుసుకుంటూ, వారు సూచించే ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించి ఆచరణలో నేర్చుకోవాలని అన్నారు.

ప్రజలతో మర్యాదపూర్వకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ చట్టాన్ని నిష్పక్షపాతంగా అమలు చేయాలని, బాధితుల సమస్యలకు సత్వర పరిష్కారం చూపుతూ ప్రజలకు న్యాయం అందించాలని సూచించారు. ప్రజల్లో పోలీస్ శాఖపై నమ్మకం, విశ్వాసం పెంపొందించే విధంగా విధులు నిర్వహిస్తూ, క్రమశిక్షణ, నిబద్ధత, సేవాభావంతో సమర్థవంతమైన పోలీస్ అధికారులుగా ఎదగాలని ట్రైనీ డీఎస్పీలకు జిల్లా ఎస్పీ సూచించారు.

P.HANMANTHU, NARAYANAPETA

P.HANMANTHU, NARAYANAPETA