Nagarkurnool: మంత్రి జూపల్లి చేతుల మీదుగా విన్పే టెక్నాలజీస్ ప్రారంభం
Nagarkurnool: కొల్లాపూర్ ఎన్మన్ బెట్ల యువకుడు శివశంకర్ హైదరాబాద్‌లో స్థాపించిన విన్పే టెక్నాలజీస్ సంస్థను ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు; పూర్తి వివరాలు.
Nagarkurnool: మంత్రి జూపల్లి చేతుల మీదుగా విన్పే టెక్నాలజీస్ ప్రారంభం
నాగర్ కర్నూల్ జిల్లా: కొల్లాపూర్.. తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటైన విన్పే టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ (WinPay Technologies Pvt. Ltd.) సంస్థ ఆదివారం అధికారికంగా ప్రారంభమైంది.నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎన్మన్ బెట్ల గ్రామానికి చెందిన నల్లపోతుల శివశంకర్ ఈ సంస్థను స్థాపించి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఫిన్‌టెక్ (FinTech), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌడ్ కంప్యూటింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ రంగాల్లో ఆధునిక సాంకేతిక సేవలు అందించడమే లక్ష్యంగా సంస్థను ఏర్పాటు చేశారు.విన్పే టెక్నాలజీస్ ద్వారా మొబైల్ రీఛార్జ్‌లు, విద్యుత్ తదితర యుటిలిటీ బిల్లుల చెల్లింపులు, క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులు, క్రెడిట్ రిపోర్ట్, వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ సేవలను అందించనున్నారు.
అదేవిధంగా గూగుల్ క్లౌడ్ మైగ్రేషన్, ఏఐ ఆధారిత పరిష్కారాలు, సాఫ్ట్వేర్ అభివృద్ధి, డేటా ఇంజినీరింగ్, ఐటీ కన్సల్టింగ్ సేవలను కూడా అందించనున్నారు. సంస్థకు గూగుల్ క్లౌడ్ పార్ట్నర్గా గుర్తింపు లభించడం విశేషం.ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ నల్లపోతుల శివశంకర్ మాట్లాడుతూ తెలంగాణ నుంచి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే సాంకేతిక సంస్థగా విన్పేను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు.
రాబోయే ఐదేళ్లలో సంస్థ కార్యకలాపాలను విస్తరించి వివిధ సాంకేతిక విభాగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా తెలంగాణ యువతకు, నూతనంగా విద్యాభ్యాసం పూర్తి చేసిన వారికి, అనుభవజ్ఞులైన ఐటీ నిపుణులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు.తమ సంస్థను ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావుకు, సహకరించిన నాగరాజుకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
భవిష్యత్తులో దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో సేవలను విస్తరించడంతో పాటు తెలంగాణ రాష్ట్ర సాంకేతిక అభివృద్ధికి, స్థానిక యువతకు ఉపాధి కల్పనకు తమ వంతు కృషి చేస్తామని సంస్థ యాజమాన్యం వెల్లడించింది. ఎన్మన్ బెట్ల గ్రామానికి చెందిన యువకుడు అంతర్జాతీయ స్థాయి సాంకేతిక రంగంలో సంస్థను స్థాపించడం పట్ల స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది.




