Mahabubnagar: పండుగ సాయన్నకు ప్రభుత్వ విప్ యెన్నం ఘన నివాళి
Mahabubnagar: పండుగ సాయన్న 174వ జయంతి సందర్భంగా మహబూబ్‌నగర్‌లో ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
Mahabubnagar: పండుగ సాయన్నకు ప్రభుత్వ విప్ యెన్నం ఘన నివాళి
Mahabubnagar: పండుగ సాయన్న 174వ జయంతిని పురస్కరించుకుని మహబూబ్ నగర్ లోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్‌లో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. పేద ప్రజల హక్కుల కోసం పోరాడి, నిరంకుశ పాలనను ఎదిరించిన పండుగ సాయన్న జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు.
నిజాం పాలన కాలంలో తెలంగాణలో సాగిన తిరుగుబాట్లు, ప్రజా ఉద్యమాల చరిత్రలో పండుగ సాయన్నకు ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. ఆనాటి దొరలు, దేశ్‌ముఖ్‌లు, భూస్వాములు, అధికారుల దోపిడీకి వ్యతిరేకంగా నిలిచి పేద ప్రజలకు అండగా నిలిచిన ధీరుడు పండుగ సాయన్న అని కొనియాడారు. సంపన్న వర్గాల ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ, పేదలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో ఆయన పోరాటం సాగించారని పేర్కొన్నారు.
తెలంగాణ రాబిన్‌హుడ్‌గా పేరుగాంచిన పండుగ సాయన్న , కేవలం సంపన్నుల నుంచి సంపదను తీసుకుని పేదలకు పంచిన వ్యక్తి మాత్రమే కాదని, ఆనాటి నిరంకుశ అధికార వ్యవస్థను సవాలు చేసి, ప్రజల కోసం ప్రత్యామ్నాయ పాలనా వ్యవస్థను నెలకొల్పేందుకు ప్రయత్నించిన పోరాట యోధుడని ఆయన గుర్తుచేశారు. సామాజిక అసమానతలు, ఆధిపత్య శక్తుల దోపిడీకి వ్యతిరేకంగా ఆయన సాగించిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్ ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.




