Veldanda: వెల్దండలో ఎంబీబీఎస్ విద్యార్థినికి ఆర్థిక సాయం!
Veldanda: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండలో ఎంబీబీఎస్ సీటు సాధించిన గుద్దటి సరితను ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి సన్మానించి రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు.
Veldanda: వెల్దండలో ఎంబీబీఎస్ విద్యార్థినికి ఆర్థిక సాయం!
Veldanda: పేద, గ్రామీణ కుటుంబాల విద్యార్థులు ప్రతిభతో ఉన్నత విద్యలో రాణిస్తే వారికి అండగా నిలవడం అభినందనీయమని పలువురు అన్నారు. వెల్దండ మండల కేంద్రానికి చెందిన గుద్దటి శేఖర్–అలివేల దంపతుల కుమార్తె గుద్దటి సరిత ఎంబీబీఎస్ సీటు సాధించి వైద్య విద్యలో ప్రవేశం పొందిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి ఆమెను అభినందించి ఆర్థిక చేయూత అందించారు. ఈ సందర్భంగా సరితతో పాటు ఆమె తల్లిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. వైద్య విద్యను కొనసాగించేందుకు రూ.10,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి ప్రతిభతో ఎంబీబీఎస్ సీటు సాధించిన సరితను అభినందిస్తూ, ఆమె భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
గోలి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో మంది విద్యార్థుల్లో ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉన్నత చదువులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. సరిత పట్టుదలతో చదివి ఎంబీబీఎస్ సీటు సాధించడం గర్వకారణమన్నారు. భవిష్యత్తులో మంచి వైద్యురాలిగా ఎదిగి ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల ఉన్నత చదువులకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు.
సరిత ఎంబీబీఎస్ సీటు సాధించడం పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల చదువులకు ఆర్థికంగా అండగా నిలుస్తున్న గోలి శ్రీనివాస్ రెడ్డి సేవలను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో వెల్దండ మండల మాజీ ఎంపీపీ, బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పుట్ట రామ్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ అనిల్ కుమార్, మాజీ అధ్యక్షులు జోగయ్య, జిల్లా నాయకులు, మాజీ ఎంపీటీసీ నాగులు నాయక్, మాజీ ఉపసర్పంచ్ నిరంజన్, మాజీ ఎంపీటీసీ జ్యోతి నిరంజన్, మాజీ సర్పంచ్ అంజి నాయక్, వెల్దండ మండల బీసీ సెల్ అధ్యక్షులు, మాజీ ఉపసర్పంచ్ నర్సింహా, ఎస్సీ సెల్ అధ్యక్షులు నాగయ్య, ఉపసర్పంచ్ రాజు, సీనియర్ నాయకులు ప్రసాద్, వెంకటయ్య, పోలె అశోక్, వార్డు సభ్యులు సునీత ఆనంద్, కుమార్, నర్సింహా, మహేష్, బర్కం గణేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.




