Wanaparthy: బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి: కలెక్టర్!

Wanaparthy: బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని, బాలికలు ఉన్నత చదువులతో ఎదగాలని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి గురువారం సూచించారు.

S.NAGESH, WANAPARTHY
Published on: 26 Nov 2026 7:46 PM IST
Wanaparthy
X

Wanaparthy: బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి: కలెక్టర్!

వనపర్తి: బాల్య వివాహాలు సమాజానికి మాయని మచ్చ మాత్రమే కాకుండా చట్టరీత్యా తీవ్రమైన నేరమని, వాటి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.

గురువారం గోపాల్‌పేట మండలం బుద్ధారం గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో మహిళా, శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, RDS సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాల్య, బలవంతపు వివాహాల నిర్మూలన దినోత్సవం మరియు ప్రపంచ బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థినులకు బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు, బాలల హక్కులు, విద్య ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బాల్య వివాహ నిషేధ చట్టం ప్రకారం 18 సంవత్సరాలు నిండని బాలికలకు, 21 సంవత్సరాలు నిండని బాలురకు వివాహం చేయడం నేరమని తెలిపారు. బాల్య వివాహాలకు పాల్పడే వారితో పాటు వాటికి సహకరించే తల్లిదండ్రులు, వివాహ నిర్వాహకులు, పురోహితులు, ఫోటోగ్రాఫర్లు, ఇతర బాధ్యులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

బాల్య వివాహాలతో బాలికల భవిష్యత్తు దెబ్బతింటుంది

చిన్న వయస్సులో వివాహం జరగడం వల్ల బాలికల విద్యాభ్యాసం మధ్యలోనే ఆగిపోవడమే కాకుండా, ఆరోగ్యపరమైన సమస్యలు, రక్తహీనత, తల్లీబిడ్డల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని కలెక్టర్ వివరించారు. మానసికంగా, ఆర్థికంగా ఎదగాల్సిన వయస్సులో వివాహ బాధ్యతలు మోయడం వల్ల వారి భవిష్యత్తు అవకాశాలు దెబ్బతింటాయని తెలిపారు.

బాలికలు ఉన్నత విద్యను అభ్యసించి డాక్టర్లు, ఇంజినీర్లు, అధికారులు, క్రీడాకారులు, పోలీసు, సైనిక రంగాల్లో రాణించేలా లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు. మహిళలు విద్యావంతులై, ఆర్థికంగా స్వతంత్రులుగా ఎదిగినప్పుడే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతాయని అన్నారు. వరకట్నం ఇవ్వడం, తీసుకోవడం కూడా చట్టరీత్యా నేరమని, మహిళలు తమ విద్య, ప్రతిభ, ఆర్థిక స్వావలంబనతో ఉన్నత స్థాయికి చేరుకోవాలని పిలుపునిచ్చారు.

బాల్య వివాహాల నిరోధానికి గ్రామస్థాయిలో చర్యలు తీసుకోవాలి

వనపర్తి జిల్లాలో బాల్య వివాహాల నిరోధానికి అధికారులు ఈ సంవత్సరం నవంబర్ 26 వరకు 35 బాల్య వివాహాలను అడ్డుకున్నారని కలెక్టర్ తెలిపారు. బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి గ్రామపంచాయతీలో ఉన్న బాలల పరిరక్షణ కమిటీల ద్వారా సమావేశాలు నిర్వహించి, గ్రామాల్లో బాల్య వివాహాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

బాల్య వివాహాలు, బాల కార్మికత్వం లేదా బాలలకు సంబంధించిన ఇతర సమస్యలు ఎదురైనప్పుడు ఎవరూ భయపడకుండా చైల్డ్ హెల్ప్‌లైన్ నంబర్ 1098కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు. బాలల రక్షణ కోసం అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటారని తెలిపారు.

ప్రభుత్వం విద్యార్థినులకు నాణ్యమైన విద్య, వసతి, భోజనం వంటి సదుపాయాలు కల్పిస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకొని మంచి పౌరులుగా ఎదగాలని విద్యార్థినులకు సూచించారు. తాము చదువుకున్న పాఠశాలలకే పరిమితం కాకుండా, తమ గ్రామాల్లోని ఇతర బాలికలకు కూడా బాల్య వివాహాలపై అవగాహన కల్పించాలని కోరారు.

ఈ సందర్భంగా విద్యార్థినులతో బాల్య వివాహాల నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించారు. బాలల హక్కులు, మంచి అలవాట్లు, లక్ష్య సాధనపై అవగాహన కల్పించారు. బాల్యవివాహ ముక్త్ భారత్ పోస్టర్లు, బాల్యవివాహ రహిత తెలంగాణ సెల్ఫీ స్టాండ్, సంతకాల సేకరణ కార్యక్రమాలు నిర్వహించారు. వ్యాసరచన, చిత్రలేఖన పోటీల్లో విజేతలైన విద్యార్థినులకు బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధికారులు:

డిప్యూటీ సీఈఓ రాం మహేశ్వర్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ భాస్కర్ నాయక్, జిల్లా సంక్షేమ అధికారి కె. సుధారాణి, RDS ప్రతినిధి చిన్నమ్మ థామస్, లేబర్ ఆఫీసర్ రవి, మైనారిటీ సంక్షేమ అధికారి సిరాజుద్దీన్, బీసీ సంక్షేమ అధికారి మధు, సీడీపీఓలు అమృతమ్మ, రాజ్యలక్ష్మి, సన్హెర, ఏసీడీపీఓ లిఖిత, సూపరింటెండెంట్ అరుంధతి, బాలల సంక్షేమ సమితి సభ్యురాలు శ్రీమతి వనజకుమారి,జిల్లా బాలల పరిరక్షణ అధికారి రాంబాబు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారులు, పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

S.NAGESH, WANAPARTHY

S.NAGESH, WANAPARTHY