Achampet: శిథిలావస్థలో బల్మూరు ప్రభుత్వ హైస్కూల్ భవనం!

Achampet: నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరు ప్రభుత్వ హైస్కూల్‌లో శిథిలావస్థకు చేరిన భవనం, భోజనంలో పురుగులు, తాగునీటి సమస్యలను పరిష్కరించాలని విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేసిన AISF.

V. RAVINDR GOUD, ACCHAMPETA
Published on: 6 Nov 2026 4:16 PM IST
Achampet
X

Achampet: శిథిలావస్థలో బల్మూరు ప్రభుత్వ హైస్కూల్ భవనం!

Achampet: బల్మూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు కనీస మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, శిథిలావస్థకు చేరిన భవనంలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని విద్యను అభ్యసిస్తున్నారని ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాల్సిన ప్రభుత్వ పాఠశాలలు సమస్యలకు నిలయాలుగా మారడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.

పాఠశాలలోని ఒక భవనం ఎప్పుడు కూలిపోతుందో తెలియని ప్రమాదకర పరిస్థితి నెలకొన్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు.

భవనం పరిస్థితిపై విద్యార్థులు పలుమార్లు సంబంధిత విద్యాధికారులకు, ఎంఈఓ, డీఈఓలకు తమ సమస్యలను వివరించి విన్నవించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి శాశ్వత పరిష్కారం చూపకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని అన్నారు.

ఇదే పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తున్నాయని, విద్యార్థులకు అందించే ఆహార నాణ్యతపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. అదేవిధంగా పాఠశాలలో వినియోగించే నీటి విషయంలోనూ తీవ్రమైన సమస్య నెలకొన్నదని, విద్యార్థులకు సురక్షితమైన తాగునీరు అందించడంలో యంత్రాంగం విఫలమైందని విమర్శించారు.

ఒకవైపు కూలిపోయే స్థితిలో ఉన్న భవనం, మరోవైపు నాణ్యత లేని మధ్యాహ్న భోజనం, ఇంకోవైపు నీటి సమస్యలతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, భవిష్యత్తు పట్ల ప్రభుత్వానికి ఏమాత్రం బాధ్యత లేదా అని ప్రశ్నించారు.

ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నాగర్‌కర్నూల్ జిల్లా కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు బల్ముల ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ.. బల్మూరు ప్రభుత్వ హైస్కూల్ సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే, జిల్లా విద్యాశాఖ అధికారులు, ఎంఈఓ, డీఈఓ తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.

ప్రమాదకరంగా ఉన్న పాఠశాల భవనాన్ని వెంటనే పరిశీలించి, విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు. అవసరమైతే తాత్కాలికంగా సురక్షితమైన తరగతి గదులు ఏర్పాటు చేసి, శాశ్వత భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలని అన్నారు.

అదేవిధంగా మధ్యాహ్న భోజనాన్ని నాణ్యతా ప్రమాణాలతో అందించేలా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, సురక్షితమైన తాగునీటి సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బల్మూరు మండల కేంద్రంలో అలుపెరుగని పోరాటాలు నిర్వహిస్తామని అధికారులను హెచ్చరించారు.

విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడితే ఏఐఎస్ఎఫ్ చూస్తూ ఊరుకోదు. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కోసం, విద్యార్థుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి సభ్యులు సంతోష్, అవినాష్, చరణ్, విజయ్, పవన్, పి. స్వాతి, అశ్విని, పల్లవి, అంజలి, సంధ్య, సౌమ్య, శరత్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

V. RAVINDR GOUD, ACCHAMPETA

V. RAVINDR GOUD, ACCHAMPETA