Devarakadra: దేవరకద్ర తహసీల్దార్ ఆఫీస్‌లో ఎమ్మెల్యే జిఎంఆర్ తనిఖీ!

Devarakadra: దేవరకద్ర తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. సర్టిఫికెట్ల జారీలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అవినీతిపై హెచ్చరించారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA
Published on: 27 Oct 2026 6:40 PM IST
Devarakadra
X

Devarakadra: దేవరకద్ర తహసీల్దార్ ఆఫీస్‌లో ఎమ్మెల్యే జిఎంఆర్ తనిఖీ!

దేవరకద్ర: దేవరకద్ర మండల తహసీల్దార్ కార్యాలయాన్ని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సోమవారం రోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ప్రజలకు అందుతున్న సేవలు, వివిధ రకాల సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ, వాటిలో జరుగుతున్న జాప్యంపై అధికారులను ప్రశ్నించారు.

ఎమ్మార్వో కార్యాలయంలో సర్టిఫికెట్ల జారీకి సంబంధించి ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని, కార్యాలయ సిబ్బంది ప్రజలకు సక్రమంగా స్పందించడం లేదని, తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయానికి వచ్చే ప్రజలకు సరైన సమాధానాలు ఇవ్వడం లేదని తరచూ ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు.

ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజల పట్ల అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఏదైనా సర్టిఫికెట్ జారీలో జాప్యం జరిగితే అందుకు గల కారణాలను సంబంధిత దరఖాస్తుదారులకు స్పష్టంగా తెలియజేయాలని ఆదేశించారు. ప్రజలు తమ పనుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి రాకుండా చూడాలని, ప్రతి ఒక్కరితో మర్యాదగా, సహనంతో మాట్లాడాలని స్పష్టం చేశారు.

ప్రభుత్వ అధికారులు తమ విధులను బాధ్యతగా నిర్వహించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించడం లేదా ఇతర అక్రమాలకు పాల్పడటం వంటి చర్యలకు దూరంగా ఉండాలని ఎమ్మెల్యే జియంఆర్ హెచ్చరించారు. అవినీతి, అక్రమాలకు పాల్పడితే అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఇలాంటి వ్యవహారాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కఠినంగా ఉన్నారని తెలిపారు.

అధికారులు ఇకనైనా తమ పనితీరును మార్చుకొని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా విధులు నిర్వహించాలని ఎమ్మెల్యే జియంఆర్ సూచించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందించడమే అధికారుల ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు. మరోసారి ఇలాంటి ఫిర్యాదులు పునరావృతమైతే సహించేది లేదని హెచ్చరించారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే జియంఆర్. ఎమ్మార్వో కార్యాలయ తనిఖీ అనంతరం భవనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే జియంఆర్ కార్యాలయ భవనం శిథిలావస్థలో ఉండటాన్ని గమనించి,

భవనానికి అవసరమైన మరమ్మతులు చేపట్టి, పునరుద్ధరణ (రెనోవేషన్) పనులు చేపట్టేందుకు సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎమ్మార్వో దీపిక, ఆర్ ఐ లు శరత్, ఫహద్, జిపిఓ రాజు, రామకృష్ణారెడ్డి కార్యాలయ సిబ్బంది నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

K. RAGUVEER KUMAR, DEVARAKADRA