Devarakadra: ఎల్ నినో, కరువుపై ముందస్తు చర్యలు చేపట్టాలి: ఎమ్మెల్యే జియంఆర్!
Devarakadra: ఎల్ నినో, కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని దేవరకద్ర ఎంపీడీవో కార్యాలయ జనరల్ బాడీ సమావేశంలో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ఆదేశించారు.
Devarakadra: ఎల్ నినో, కరువుపై ముందస్తు చర్యలు చేపట్టాలి: ఎమ్మెల్యే జియంఆర్!
దేవరకద్ర: దేవరకద్ర ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా రానున్న రోజుల్లో ఎల్ నినో ప్రభావంతో ఏర్పడే వాతావరణ పరిస్థితులు, కరువు ముప్పు, వ్యవసాయ రంగంపై వాటి ప్రభావం, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన, తాగునీటి అవసరాలు తదితర కీలక అంశాలపై వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్యే సమగ్రంగా చర్చించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో అధికారులు ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలని, కరువు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ ప్రణాళికలు రూపొందించుకునేలా రైతులకు సంబంధిత శాఖల అధికారులు తగిన సూచనలు, సలహాలు అందించాలన్నారు.
అలాగే తక్కువ నీరు అవసరమయ్యే ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించాలని, అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకునే విధానాలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయ శాఖ అందిస్తున్న పథకాలు, ప్రోత్సాహకాలు, రైతులకు ఉపయోగపడే ప్రత్యామ్నాయ సాగు విధానాలను గ్రామస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలని తెలిపారు.
కరువు పరిస్థితుల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఉపాధి సమస్యలు తలెత్తకుండా ఉపాధి హామీ పథకం ద్వారా అవసరమైన పనులను గుర్తించి ముందస్తు కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే. అలాగే కరువు నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనులను సమర్థవంతంగా అమలు చేస్తూ అర్హులైన కూలీలకు పని కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
అదేవిధంగా ఈ సమావేశంలో వ్యవసాయ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఉపాధి హామీ, వైద్య ఆరోగ్య, విద్యుత్, మిషన్ భగీరథ, గ్రామీణ నీటి సరఫరా, పశుసంవర్ధక, ఉద్యానవన శాఖలకు చెందిన అధికారులతో ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా చర్చించారు.
ఆయా శాఖల ద్వారా ప్రస్తుతం చేపడుతున్న కార్యక్రమాలు, ప్రజలకు అందిస్తున్న సేవలు, అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు, రైతులు మరియు గ్రామీణ ప్రజలకు అందిస్తున్న ప్రోత్సాహకాలు, రానున్న రోజుల్లో చేపట్టనున్న కార్యాచరణ గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ప్రజల అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రతి శాఖ బాధ్యతాయుతంగా పనిచేయాలని, దేవరకద్ర నియోజకవర్గంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే గారు ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.




