Narayanpet: నారాయణపేట కలెక్టరేట్ పనుల పరిశీలన: కలెక్టర్ ప్రియాంక

Narayanpet: నారాయణపేట సింగారం మలుపు వద్ద నిర్మిస్తున్న నూతన ఐడీవోసీ పనులను కలెక్టర్ ప్రియాంక పరిశీలించి, పది రోజుల్లో ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఆదేశించారు.

P.HANMANTHU, NARAYANAPETA
Published on: 5 Nov 2026 8:09 PM IST
Narayanpet
X

Narayanpet: నారాయణపేట కలెక్టరేట్ పనుల పరిశీలన: కలెక్టర్ ప్రియాంక

నారాయణపేట జిల్లా: నారాయణపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని సింగారం మలుపు వద్ద నిర్మిస్తున్న నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ) భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ప్రియాంక గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టరేట్ భవన సముదాయంలోని వివిధ విభాగాలు, ఛాంబర్లు, సమావేశ మందిరాలు, ఇతర మౌలిక సదుపాయాల పనులను నిశితంగా తనిఖీ చేసి, నిర్మాణ పనుల ప్రస్తుత పురోగతిపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

నూతన కలెక్టరేట్‌లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్, వీడియో కాన్ఫరెన్స్ హాల్, సమావేశ మందిరం తదితర విభాగాల్లో కొనసాగుతున్న ఫర్నిచర్ ఏర్పాటు పనులను కలెక్టర్ ప్రత్యేకంగా పరిశీలించారు. ఆయా గదుల్లో ఏర్పాటు చేస్తున్న ఫర్నిచర్ నాణ్యత, అమరిక, ఇంటీరియర్ డిజైన్ పనులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఛాంబర్లు ఆహ్లాదకరంగా, ఆకర్షణీయంగా ఉండేలా అవసరమైన మార్పులు, చేర్పులు చేపట్టాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న ఫర్నిచర్ పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ జాప్యం చేయకుండా త్వరితగతిన పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు.

వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో ఏర్పాటు చేస్తున్న సౌండ్ సిస్టమ్, ఫర్నిచర్ పనులను పరిశీలిస్తూ, సమావేశాలు,ఉన్నతాధికారులతో నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌లకు ఎలాంటి అంతరాయం కలగకుండా సౌండ్ సిస్టమ్ స్పష్టమైన శబ్ద నాణ్యతతో పనిచేసేలా చూడాలని సూచించారు. ఆధునిక సాంకేతిక సదుపాయాలు సమర్థవంతంగా వినియోగించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు ఉండాలని స్పష్టం చేశారు.

అనంతరం కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేస్తున్న వాహనాల పార్కింగ్ స్థలాన్ని పరిశీలించారు. కార్యాలయానికి వచ్చే అధికారులు, ఉద్యోగులు, వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పార్కింగ్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని సూచించారు. పార్కింగ్ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ వెంకట రమణయ్యను ఆదేశించారు.

కలెక్టరేట్ భవన సముదాయంలో మిగిలి ఉన్న చిన్నచిన్న పనులను సైతం నిర్లక్ష్యం చేయకుండా గుర్తించి పూర్తి చేయాలని, అన్ని విభాగాల్లో విద్యుత్, ఫర్నిచర్, ఇతర మౌలిక సదుపాయాలను సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

పది రోజుల్లోగా చివరి దశ పనులన్నింటినీ పూర్తి చేసి నూతన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభోత్సవానికి పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని, నిర్దేశించిన గడువులోగా పనులన్నీ పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆమె పేర్కొన్నారు.

ఈ పరిశీలనలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, డీఆర్డీఓ వెంకట్ రాములు, కలెక్టరేట్ ఏవో అనిల్ కుమార్, సీపీఓ ఖాఘ వాహన్, ఆర్‌అండ్‌బీ డీఈఈ రాములు, తహసీల్దార్ అమరేంద్ర కృష్ణ, ఏఈలు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

P.HANMANTHU, NARAYANAPETA

P.HANMANTHU, NARAYANAPETA