Narayanpet: నారాయణపేట ఐడీఓసీ భవన పనులను పరిశీలించిన కలెక్టర్!
Narayanpet: నారాయణపేట సింగారం వద్ద నిర్మిస్తున్న నూతన ఐడీఓసీ భవన పనులను పరిశీలించిన కలెక్టర్ ప్రియాంక. పది రోజుల్లో పనులు పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఆదేశం.
Narayanpet: నారాయణపేట ఐడీఓసీ భవన పనులను పరిశీలించిన కలెక్టర్!
నారాయణపేట: నారాయణపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని సింగారం మలుపు వద్ద నిర్మిస్తున్న నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ) భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ప్రియాంక శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా భవన సముదాయంలో కొనసాగుతున్న వివిధ పనులను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
నూతన కలెక్టరేట్లోని మంత్రి ఛాంబర్, కలెక్టర్, అదనపు కలెక్టర్ ఛాంబర్లు, వీడియో కాన్ఫరెన్స్ హాల్, ఎన్ఐసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లలో కొనసాగుతున్న ఫర్నిచర్ పనులను కలెక్టర్ పరిశీలించారు. పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ఛాంబర్లలో ఇంటీరియర్ డిజైన్ ఆకర్షణీయంగా ఉండేలా చూడాలని, అవసరమైన మార్పులు చేపట్టాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేస్తున్న ఫర్నిచర్, సౌండ్ సిస్టమ్ నాణ్యత, వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం భవన సముదాయంలోని వివిధ శాఖలకు కేటాయిస్తున్న హాళ్లు, గదులను పరిశీలించారు. పై అంతస్తులో శాఖలకు కేటాయిస్తున్న గదుల వివరాలను అదనపు కలెక్టర్ శ్రీను, ఏవో అనిల్ కుమార్లను అడిగి తెలుసుకున్నారు. మిగిలిన శాఖలకు కూడా అవసరానికి అనుగుణంగా గదులు కేటాయించేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
కలెక్టరేట్ భవన సముదాయానికి నిరంతర తాగునీటి సరఫరా కల్పించే అంశంపై మిషన్ భగీరథ ఈఈతో ఫోన్లో మాట్లాడారు. భవన సముదాయానికి అవసరమైన తాగునీటి సరఫరా ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు, బ్యాంకు ఏటీఎం కేంద్రానికి కేటాయించనున్న గదులను పరిశీలించి, వాటి వినియోగానికి సంబంధించి పలు సూచనలు చేశారు.
కలెక్టరేట్ ప్రాంగణంలో హెలిప్యాడ్ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్, సంబంధిత అధికారులతో చర్చించారు. హెలిప్యాడ్ ఏర్పాటుకు అనువైన ప్రదేశాన్ని గుర్తించి, అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
నూతన కలెక్టరేట్ భవన సముదాయంలో మిగిలిన నిర్మాణ పనులన్నింటినీ వారం నుంచి పది రోజుల్లోగా పూర్తి చేసి, ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. పనుల పూర్తిలో జాప్యం లేకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ పరిశీలనలో ఆర్అండ్బీ ఈఈ వెంకట రమణయ్య, డీఈఈ రాములు, తహసిల్దార్ అమరేంద్ర కృష్ణ, ఏఈలు, తదితరులు పాల్గొన్నారు.




