Nagarkurnool: ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి!

Nagarkurnool: నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు.

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL
Published on: 18 Nov 2026 7:39 AM IST
Nagarkurnool
X

Nagarkurnool: ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి!

Nagarkurnool: ప్రభుత్వ ఆసుపత్రి లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలి, వైద్య అధికారులకు సూచించిన జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ వైద్యాధికారులను ఆదేశించారు.

మంగళవారం నాగర్‌కర్నూల్ జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష సమావేశ మందిరంలో జిల్లా ఆసుపత్రి వైద్యులు, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రొఫెసర్లు, వివిధ వైద్య విభాగాల హెచ్‌ఓడీలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని అన్ని వైద్య విభాగాల్లో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలు, పరికరాలు, సిబ్బంది వివరాలను సమీక్షించి, అవసరమైన మౌలిక సదుపాయాల కొరతను గుర్తించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు, ఆసుపత్రిలో స్వచ్ఛమైన తాగునీటి సరఫరా కోసం ఆర్‌ఓ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

మాతా శిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్), ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్) నిర్వహణ, వైద్య సేవలు, అందుబాటులో ఉన్న సదుపాయాలపై సమీక్షించారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలోని కొన్ని విభాగాలను ఉయ్యాలవాడలోని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రాంగణానికి తరలించే అంశంపై అధికారులతో చర్చించారు.

తరలింపునకు అవసరమైన భవనాలు, మౌలిక వసతులు, ఇతర సౌకర్యాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రక్రియకు సంబంధించి ముందస్తు ప్రణాళికతో అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.

జిల్లా ప్రజలకు అధునాతన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చే లక్ష్యంతో త్వరలో ఎంఆర్ఐ (MRI) స్కానింగ్ సదుపాయాన్ని ప్రారంభించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే జిల్లాలోని రోగులు అత్యాధునిక వైద్య పరీక్షలను స్థానికంగానే చేయించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.

ఇందుకు అవసరమైన యంత్ర పరికరాలు, సాంకేతిక సదుపాయాలు, ఇతర ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్యులు అంకితభావంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సూచించారు.

క్రిటికల్ కేర్ లో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలు, అవసరమైన పరికరాలు, సిబ్బంది వివరాలు, ఇతర మౌలిక వసతుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందించేందుకు అవసరమైన అన్ని సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

ప్రభుత్వ ఆసుపత్రిలోని అన్ని వైద్య విభాగాలను మరింత బలోపేతం చేసి, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు వైద్యాధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. గుర్తించిన సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తూ, అవసరమైన చర్యలను వెంటనే చేపట్టాలని స్పష్టం చేశారు.

ఈ సమీక్ష సమావేశంలో జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ సుప్రియ, డాక్టర్ రఘు, వైద్యులు, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రొఫెసర్లు, వివిధ వైద్య విభాగాల హెచ్‌ఓడీలు తదితరులు పాల్గొన్నారు.

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL