Kalwakurthy: పంజాగుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్!
Kalwakurthy: పంజాగుల ప్రాథమికోన్నత పాఠశాలను కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ ఆకస్మికంగా తనిఖీ చేసి, విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనంపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Kalwakurthy: పంజాగుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్!
Kalwakurthy: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం పంజాగుల గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యాబోధన, విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల విధుల నిర్వహణ, మౌలిక వసతులు, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
పాఠశాలలో ఒకటి నుంచి ఏడో తరగతి వరకు మొత్తం ఎంతమంది విద్యార్థులు నమోదయ్యారు, ప్రతిరోజూ ఎంతమంది హాజరవుతున్నారనే వివరాలను ప్రధానోపాధ్యాయుడిని అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో మొత్తం 43 మంది విద్యార్థులు ఉండగా, నలుగురు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నట్లు ప్రధానోపాధ్యాయుడు కలెక్టర్కు వివరించారు.
విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రతిరోజూ విద్యార్థుల హాజరును పర్యవేక్షిస్తూ, పాఠశాలకు రాని విద్యార్థుల తల్లిదండ్రులతో సంప్రదింపులు జరపాలని తెలిపారు. గ్రామంలోని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని కోరారు. విద్యార్థుల సంఖ్య పెరిగితే అవసరానికి అనుగుణంగా అదనపు ఉపాధ్యాయులను నియమించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
అనంతరం తరగతి గదులు, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, విద్యుత్ సదుపాయం, పాఠశాల పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. విద్యార్థులకు ఆహ్లాదకరమైన, పరిశుభ్రమైన వాతావరణంలో విద్యాబోధన అందించాలని సూచించారు. పాఠశాలలో ఉన్న మౌలిక వసతుల సమస్యలను గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
మధ్యాహ్న భోజన పథకం అమలుపై కూడా కలెక్టర్ ఆరా తీశారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా, ఆహార పదార్థాల నాణ్యత ఎలా ఉంది, వంటశాలలో పరిశుభ్రత పాటిస్తున్నారా అనే అంశాలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందించాలని, భోజనం తయారీలో పరిశుభ్రత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు. పాఠశాలలో నిర్మాణంలో ఉన్న కిచెన్ షెడ్ పనులను పరిశీలించిన కలెక్టర్, నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధనతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు, పౌష్టికాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు. పాఠశాలల పనితీరును అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, విద్యా ప్రమాణాల పెంపునకు కృషి చేయాలని సూచించారు.
గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధిలో భాగంగా వ్యవసాయ అభివృద్ధి, నీటి సంరక్షణ, మహిళా సంఘాల ఆర్థిక స్వావలంబనతో పాటు ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యా ప్రమాణాలు, మౌలిక వసతుల మెరుగుదలకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ వెంట కల్వకుర్తి తహసీల్దార్ ఇబ్రహీం, ఎంపీడీవో యాదయ్య, మండల విద్యాధికారి శంకర్ నాయక్, గ్రామ సర్పంచి పర్వతాలు, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.




