Nagarkurnool: కలెక్టరేట్‌లో 16న పిల్లల ప్రత్యేక ‘బాలల ప్రజావాణి’!
Nagarkurnool: బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా నవంబర్ 16న నాగర్ కర్నూల్ కలెక్టరేట్‌లో ప్రత్యేక ‘బాలల ప్రజావాణి’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ తెలిపారు.
Nagarkurnool: కలెక్టరేట్‌లో 16న పిల్లల ప్రత్యేక ‘బాలల ప్రజావాణి’!
Nagarkurnool: బాలల హక్కుల వారోత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 16వ తేదీ సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్‌లో పిల్లల కోసం ప్రత్యేకంగా ‘బాలల ప్రజావాణి’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
బాలల హక్కులపై సమాజంలో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు, చిన్నారులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు బాధ్యతాయుతంగా కృషి చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగే సాధారణ ప్రజావాణి ప్రాంగణంలోనే పిల్లల కోసం ప్రత్యేక డెస్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ ప్రత్యేక ప్రజావాణి ద్వారా పిల్లలు తమకు ఎదురవుతున్న సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చి, వినతిపత్రాలు సమర్పించవచ్చని కలెక్టర్ తెలిపారు. ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, పోషకాహారం, బాలల రక్షణ, ప్రాథమిక సౌకర్యాలు, సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వ పథకాల ద్వారా అందాల్సిన ప్రయోజనాలు తదితర అంశాలపై తమ సమస్యలను తెలియజేయవచ్చన్నారు.
బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, పిల్లలకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రభుత్వ శాఖలతో పాటు సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ సూచించారు. పిల్లలు నిర్భయంగా తమ సమస్యలను అధికారులకు తెలియజేసేందుకు ఈ ప్రత్యేక వేదిక ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
కావున జిల్లాలోని పిల్లలు, వారి తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బాలల హక్కులకు సంబంధించిన సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ కోరారు.




