Nagarkurnool: ప్రత్యామ్నాయ పంటల సాగుతో రైతులు అధిక ఆదాయం పొందాలి..కలెక్టర్!
Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లా రైతులు వరి సాగును తగ్గించి, తక్కువ నీటితో అధిక ఆదాయం ఇచ్చే ఆరుతడి పంటలు, పందిరి కూరగాయల సాగుపై దృష్టి సారించాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ సూచించారు.
Nagarkurnool: ప్రత్యామ్నాయ పంటల సాగుతో రైతులు అధిక ఆదాయం పొందాలి..కలెక్టర్!
Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లా రైతులు సంప్రదాయ పంటల సాగు విధానాలకు ప్రత్యామ్నాయంగా తక్కువ నీటి వినియోగంతో అధిక ఆదాయం అందించే ఆరుతడి పంటలు, పందిరి కూరగాయల సాగును ప్రోత్సహించుకోవాలని, పంటల మార్పిడి విధానాన్ని అనుసరించడం ద్వారా భూసారాన్ని కాపాడుకోవడంతో పాటు సాగు ఖర్చులను తగ్గించుకొని మెరుగైన ఆదాయం పొందవచ్చని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రైతాంగానికి తెలిపారు.
మంగళవారం కల్వకుర్తి మండలంలోని ముకురాల, పంజాగుల గ్రామాల్లో కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులు చేపట్టిన ప్రత్యామ్నాయ పంటల సాగు విధానాలను పరిశీలించారు. పంటల సాగు విధానం, పెట్టుబడి వ్యయం, దిగుబడులు, మార్కెటింగ్ అవకాశాలు, రైతులకు లభిస్తున్న ఆదాయం తదితర అంశాలపై రైతులతో నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
ముందుగా కల్వకుర్తి మండలం ముకురాల గ్రామంలో రైతు రాజేందర్ రెడ్డి తన ఆరు ఎకరాల వ్యవసాయ భూమిలో చేపట్టిన పందిరి కూరగాయలు, చిక్కుడు సాగును కలెక్టర్ పరిశీలించారు. పందిరి సాగు విధానంలో మొక్కల పెంపకం, పంటల నిర్వహణ, నీటి వినియోగం, దిగుబడి వివరాలను రైతును అడిగి తెలుసుకున్నారు.
సంప్రదాయ పంటలతో పోలిస్తే ప్రత్యామ్నాయ పంటల సాగు ద్వారా ఎంత మేరకు ఆదాయం లభిస్తుందనే అంశాలను చర్చించారు. అదే విధంగా గ్రామంలో సాగు చేస్తున్న బొప్పాయి పంటను కూడా పరిశీలించి, మొక్కల పెరుగుదల, పంట దిగుబడి, సాగు ఖర్చులు, మార్కెటింగ్ అవకాశాల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ మాట్లాడుతూ ప్రస్తుత సీజన్ పరిస్థితిలో వరి సాగును పూర్తిస్థాయిలో తగ్గించి, నీటి లభ్యతకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు.
వరి సాగుకు అధికంగా నీరు అవసరమవుతుందని, అదే సమయంలో కూరగాయలు, నూనెగింజలు, చిరుధాన్యాలు, తృణధాన్యాలు వంటి ఆరుతడి పంటలను ప్రణాళికాబద్ధంగా సాగు చేస్తే నీటి పొదుపుతో పాటు అదనపు ఆదాయం పొందవచ్చని జిల్లా కలెక్టర్ వివరించారు.
రైతులు ఒకే రకమైన పంటపై ఆధారపడకుండా పంటల వైవిధ్యాన్ని పెంచుకోవాలని, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను గుర్తించి సాగు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. పంట వేసే ముందే మార్కెట్ అవసరాలు, ధరలు, పెట్టుబడి వ్యయం, దిగుబడి అవకాశాలను అంచనా వేసుకోవాలని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ ఆధునిక సాగు పద్ధతులను అవలంబించాలని రైతులకు అవగాహన కల్పించారు.
ముకురాల గ్రామంలో ఎద్దు గానుగ ద్వారా తయారు చేస్తున్న నూనె ఉత్పత్తులను కూడా జిల్లా కలెక్టర్ పరిశీలించారు. సంప్రదాయ పద్ధతిలో నూనె తయారీ విధానం, ఉపయోగిస్తున్న ముడి సరుకులు, ఉత్పత్తుల నాణ్యత, తయారీ వ్యయం, విక్రయ విధానం తదితర వివరాలను నిర్వాహకులు, రైతులను అడిగి తెలుసుకున్నారు.
సంప్రదాయ గానుగ నూనెలకు వినియోగదారుల్లో ఉన్న ఆదరణ, ఉత్పత్తులకు మార్కెట్లో లభిస్తున్న ధరలు, మార్కెటింగ్ అవకాశాలపై జిల్లా కలెక్టర్ ఆరా తీశారు.
రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను కేవలం ముడి సరుకులుగా విక్రయించకుండా, వాటికి విలువ జోడించి నాణ్యమైన ఉత్పత్తులుగా తయారు చేసి మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. స్థానికంగా లభించే వనరులను వినియోగించుకొని చిన్న తరహా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఆహార ఉత్పత్తుల తయారీ యూనిట్లను ప్రోత్సహించుకోవాలని తెలిపారు.




