Bijinapally: నందివడ్డేమాన్‌లో పశువుల ఫెర్టిలిటీ క్యాంప్ పరిశీలన
Bijinapally: నందివడ్డేమాన్ పశు వైద్య కేంద్రంలో ఫెర్టిలిటీ క్యాంపును కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ పరిశీలించారు. పశువులకు సకాలంలో వైద్యం అందించాలని సూచించారు.
Bijinapally: నందివడ్డేమాన్‌లో పశువుల ఫెర్టిలిటీ క్యాంప్ పరిశీలన
బిజినపల్లి: నాగర్‌కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని బిజినపల్లి మండలం నందివడ్డేమాన్ గ్రామంలోని ప్రాథమిక పశు వైద్య కేంద్రంలో కొనసాగుతున్న ఫెర్టిలిటీ క్యాంప్, కృత్రిమ గర్భధారణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ బుధవారం పరిశీలించారు. క్యాంప్‌లో పశువులకు అందిస్తున్న వైద్య సేవలను స్వయంగా పరిశీలించిన కలెక్టర్. పశువైద్యులు, సిబ్బందిని కార్యక్రమం నిర్వహణకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
పశువుల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు చేపడుతున్న కృత్రిమ గర్భధారణ కార్యక్రమం అమలు తీరును కలెక్టర్ పరిశీలించారు. గ్రామంలోని పశుపోషక రైతులకు ఈ కార్యక్రమం ద్వారా అందుతున్న సేవలు, కృత్రిమ గర్భధారణ చేయించుకున్న పశువుల వివరాలు, సంతానోత్పత్తికి సంబంధించిన అంశాలపై పశువైద్యులను అడిగి తెలుసుకున్నారు.
పశువులకు అందిస్తున్న వ్యాధి నిరోధక టీకాలపై జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా ఆరా తీశారు. ముద్ద చర్మ వ్యాధి, జబ్బ వ్యాధి, గొంతువాపు తదితర వ్యాధుల నివారణకు పశువులకు టీకాలు అందుతున్నాయా, ఎంతమంది పశువులకు టీకాలు వేశారు, ఇంకా ఎన్ని పశువులకు టీకాలు వేయాల్సి ఉంది అనే వివరాలను పశువైద్యులను అడిగి తెలుసుకున్నారు.
గ్రామంలో పశువుల సంఖ్య, నమోదైన పశువుల వివరాలు, పశువుల ఆరోగ్య పరిస్థితి, వ్యాధుల వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, పశువులకు వ్యాధులు సోకినప్పుడు వెంటనే గుర్తించి సకాలంలో వైద్య సేవలు అందించాలని, వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత పశువైద్య సిబ్బందికి సూచించారు.
అనంతరం పశు వైద్య కేంద్రానికి వచ్చిన రైతులు, పశుపోషకులతో జిల్లా కలెక్టర్ నేరుగా మాట్లాడారు. పశువులకు వైద్య సేవలు ఎలా అందుతున్నాయి, అవసరమైన సమయంలో పశువైద్యులు అందుబాటులో ఉంటున్నారా, టీకాలు సకాలంలో వేస్తున్నారా, కృత్రిమ గర్భధారణ సేవలు అందుతున్నాయా వంటి అంశాలను రైతులను అడిగి తెలుసుకున్నారు.
పశువుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. పశువులకు ఏదైనా అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే సమీపంలోని పశు వైద్య కేంద్రాన్ని సంప్రదించాలని తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ మాట్లాడుతూ...... పశుసంపద రైతుల జీవనోపాధికి ముఖ్యమైన ఆధారమని, పశువుల ఆరోగ్యం మెరుగ్గా ఉన్నప్పుడే పశుపోషక రైతులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుందని, పశువులకు అవసరమైన టీకాలను సకాలంలో అందించడం ద్వారా వివిధ అంటువ్యాధులను నియంత్రించవచ్చని తెలిపారు. గ్రామాల్లో పశువుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, వ్యాధుల లక్షణాలు కనిపించిన వెంటనే అవసరమైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ పశువైద్య సిబ్బందికి సూచించారు.
కృత్రిమ గర్భధారణ ద్వారా పశువుల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరచడంతో పాటు నాణ్యమైన పశుసంపద అభివృద్ధికి అవకాశం ఉంటుందని, అర్హత కలిగిన పశువులకు కృత్రిమ గర్భధారణ సేవలను సకాలంలో అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
గ్రామంలోని పశువుల పూర్తి వివరాలను నమోదు చేసుకోవడంతో పాటు పశువులకు వేసిన టీకాలు, అందించిన వైద్య సేవలు, కృత్రిమ గర్భధారణ తదితర వివరాలను పద్ధతిగా నమోదు చేయాలని సూచించారు. పశువైద్య కేంద్రాలకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన సేవలు అందించాలని తెలిపారు.
జిల్లా కలెక్టర్ వెంట బిజినపల్లి తాహసిల్దార్ మునీరుద్దీన్ , ఎంపీడీవో, నందివడ్డేమాన్ గ్రామం సర్పంచ్ తిప్పిరెడ్డి సుగుణమ్మ , ఉప సర్పంచ్ చింతల నాగ రాజు వార్డు సభ్యులు, సంబంధిత పశుసంవర్ధక శాఖ అధికారులు, పశువైద్యులు, సిబ్బంది, రైతులు తదితరులు ఉన్నారు.




