Nagarkurnool: నాగర్‌కర్నూల్‌లో త్వరలో ఎంఆర్ఐ స్కానింగ్ సేవలు.. కలెక్టర్!
Nagarkurnool: నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో త్వరలోనే ఎంఆర్ఐ స్కానింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ తెలిపారు.
Nagarkurnool: నాగర్‌కర్నూల్‌లో త్వరలో ఎంఆర్ఐ స్కానింగ్ సేవలు.. కలెక్టర్!
Nagarkurnool: ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా ఆసుపత్రి వైద్యులు, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రొఫెసర్లు, వివిధ వైద్య విభాగాల హెచ్‌ఓడీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఆసుపత్రిలో వైద్య పరికరాలు, సిబ్బంది, అందుబాటులో ఉన్న సౌకర్యాలను సమీక్షించి, కొరతలను గుర్తించాలని సూచించారు. రోగులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ఆర్‌ఓ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
మాతా శిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్), ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్) నిర్వహణ, వైద్య సేవలపై సమీక్షించారు. ప్రస్తుతం జిల్లా ఆసుపత్రిలోని కొన్ని విభాగాలను ఉయ్యాలవాడలోని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రాంగణానికి తరలించే అంశంపై చర్చించి, అవసరమైన భవనాలు, మౌలిక సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ ప్రక్రియకు ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని సూచించారు.జిల్లా ప్రజలకు ఆధునిక వైద్య సేవలు అందించేందుకు త్వరలో ఎంఆర్ఐ స్కానింగ్ సదుపాయాన్ని ప్రారంభించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
క్రిటికల్ కేర్ విభాగంలో అవసరమైన వైద్య పరికరాలు, సిబ్బంది, ఇతర సౌకర్యాలను సమకూర్చాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని అన్ని విభాగాలను బలోపేతం చేసి పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేలా వైద్యాధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుప్రియ, డాక్టర్ రఘు, డాక్టర్ రోహిత్, డాక్టర్ ప్రశాంత్, వైద్య కళాశాల ప్రొఫెసర్లు, వివిధ విభాగాల హెచ్‌ఓడీలు పాల్గొన్నారు.




