Nagarkurnool: నవంబర్ 19 నుంచి ఇందిరమ్మ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ!

Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లాలో నవంబర్ 19 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ తెలిపారు.

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL
Published on: 18 Nov 2026 9:44 AM IST
Nagarkurnool
X

Nagarkurnool: నవంబర్ 19 నుంచి ఇందిరమ్మ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ!

Nagarkurnool: రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అర్హులైన ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ కోరారు.

ఈ నెల 19 నుంచి గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల వారీగా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించనున్నట్లు వెల్లడించారు.

మంగళవారం కలెక్టరేట్‌లో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, వార్డు అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన వారు ఈ పథకానికి అర్హులని, 1967 నవంబర్ 19 నుంచి 2008 నవంబర్ 18 మధ్య జన్మించిన వారి వివరాలను నమోదు చేయనున్నట్లు తెలిపారు.

కులం, మతం, ఆదాయ పరిమితులతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి బీమా భద్రత కల్పించడమే పథకం ఉద్దేశమన్నారు. కుటుంబంలో జీవనోపాధికి ప్రధాన ఆధారమైన వ్యక్తిని బీమా కోసం ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుందని వివరించారు.

దరఖాస్తు సమయంలో కుటుంబ సభ్యులు, బీమా పొందే వ్యక్తి, నామినీల వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. నామినీల వివరాలు, బీమా మొత్తాన్ని పంపిణీ చేసే నిష్పత్తిని కూడా దరఖాస్తులో పొందుపరచవచ్చన్నారు.

దరఖాస్తుదారులు ఆధార్, రేషన్ కార్డులను వెంట తీసుకురావాలని సూచించారు. రేషన్ కార్డులు లేని కుటుంబాల వివరాలను కూడా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పరిశీలించి నమోదు చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలోని అర్హులైన ప్రతి కుటుంబానికి ఈ పథకం ప్రయోజనం అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దేవ సహాయం, సీపీఓ సుజాత, డీఆర్డీఓ చిన్న ఓబులేసు, ఈడీఎం నరేశ్, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL