Wanaparthy: ఇందిరా కుటుంబ జీవిత బీమా నమోదు వేగవంతం చేయాలి.. కలెక్టర్!
Wanaparthy: వనపర్తిలో బీమా నమోదు శిబిరాన్ని కలెక్టర్ ఆదర్శ్ సురభి తనిఖీ చేశారు. హరిజనవాడ పాఠశాల తరగతి గదుల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
Wanaparthy: ఇందిరా కుటుంబ జీవిత బీమా నమోదు వేగవంతం చేయాలి.. కలెక్టర్!
Wanaparthy: వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి శనివారం వనపర్తి పట్టణంలోని 21వ వార్డు ఎస్సీ కమ్యూనిటీ హాల్లో నిర్వహిస్తున్న ఇందిరా కుటుంబ జీవిత బీమా పథకం నమోదు శిబిరాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శిబిరంలో కొనసాగుతున్న బీమా నమోదు ప్రక్రియను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ప్రజలందరికీ ఇందిరా కుటుంబ జీవిత బీమా పథకం నమోదు శిబిరం గురించి విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. ప్రతి ఒక్కరూ శిబిరానికి వచ్చి బీమా పథకంలో నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలని తెలిపారు.
నమోదు సమయంలో బీమాదారు, నామినీ వివరాలను ఎలాంటి తప్పులు లేకుండా నమోదు చేయాలని, నమోదు ప్రక్రియ పూర్తయిన అనంతరం సంబంధిత వివరాలను రిజిస్టర్లో నమోదు చేసి, లబ్ధిదారుల సంతకాలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతిరోజూ కనీసం 50 కుటుంబాలకు బీమా నమోదు పూర్తయ్యేలా సిబ్బంది చర్యలు తీసుకోవాలని సూచించారు.
అనంతరం కలెక్టర్ పట్టణంలోని హరిజనవాడ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి, పాఠశాలలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అదనపు తరగతి గదుల నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించి, పలు సూచనలు చేశారు.
పాఠశాలలో ఆధునిక తరగతి గదుల నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మంజూరైన నిధులను సమర్థవంతంగా వినియోగిస్తూ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా తరగతి గదుల నిర్మాణాన్ని చేపట్టాలని తెలిపారు.
నిర్మాణానికి సంబంధించి సరిపడా స్థలం అందుబాటులో ఉన్నందున, మరోసారి పూర్తి ప్రణాళికను సిద్ధం చేసి, నిర్మాణ పనులకు సంబంధించిన నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించారు. జడ్పీ సీఈవో యాదయ్య, తహసిల్దార్ రమేష్ రెడ్డి, ఇతర అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.




