Nagarkurnool: చలికాలంలో గుండెపోటు ముప్పు అధికం.. కార్డియాలజిస్ట్ డాక్టర్!
Nagarkurnool: చలికాలంలో గుండెపోటు, గుండె వైఫల్యం ముప్పు పెరిగే అవకాశం ఉందని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రణీత్ పొలమూరి హెచ్చరించారు.
Nagarkurnool: చలికాలంలో గుండెపోటు ముప్పు అధికం.. కార్డియాలజిస్ట్ డాక్టర్!
Nagarkurnool: చలికాలంలో గుండెపోటు, గుండె వైఫల్యం వచ్చే ప్రమాదం పెరిగే అవకాశం ఉందని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రణీత్ పొలమూరి హెచ్చరించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చలి కారణంగా రక్తనాళాలు కుంచించుకుపోయి రక్తపోటు పెరుగుతుందని, దీంతో గుండెపై అదనపు ఒత్తిడి పడుతుందని తెలిపారు. ఇప్పటికే గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారు చలికాలంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అధిక రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. గుండె రక్తాన్ని పంపింగ్ చేసే సామర్థ్యం తగ్గినవారు, రక్తనాళాల్లో బ్లాకేజీలు ఉన్నవారికి ప్రమాదం ఎక్కువగా ఉంటుందన్నారు. చలికాలంలో నీరు తక్కువగా తాగడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గి రక్తం చిక్కబడుతుందని, తద్వారా రక్తం గడ్డకట్టే ప్రమాదం పెరుగుతుందని వివరించారు.
చలి నుంచి రక్షణకు తగిన దుస్తులు ధరించాలని, పొగతాగడం, మద్యం సేవించడం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. వైద్యులు సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడటంతో పాటు అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. గుండె ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ ప్రణీత్ పొలమూరి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి మార్కెటింగ్ సిబ్బంది రాజు తదితరులు పాల్గొన్నారు.




