Makthal: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం!
Makthal: బీజేపీ కార్యకర్తల శక్తిని తక్కువ అంచనా వేయొద్దని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి అన్నారు.
Makthal: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం!
Makthal: మక్తల్ నియోజకవర్గం నర్వ మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీజేపీ పార్టీని, బీజేపీ కార్యకర్తలను తక్కువ చేసి మాట్లాడటం సరికాదని నర్వ లోని తన ఫార్మ్ హౌస్ లో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి మాటలను తీవ్రంగా ఖండించారు.
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీని ఓడించి బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డిని గెలిపించింది బీజేపీ కార్యకర్తలేనని, మల్కాజిగిరిలో ఈటల రాజేందర్‌ను, మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానంలో డీకే అరుణమ్మను గెలిపించింది కూడా బీజేపీ శ్రేణులేనని గుర్తు చేశారు.
ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమమని, రాజకీయాల్లో ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదని హితవు పలికారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి బాధ్యతాయుతమైన వ్యాఖ్యలు చేయాల్సిన రేవంత్ రెడ్డి, అహంకారపూరితంగా రాజకీయ విమర్శలు చేయడం తగదన్నారు.
గతంలో అధికార గర్వంతో విర్రవీగిన నాయకులు కాలగర్భంలో కలిసిపోయారని, అలాంటి పరిస్థితి ఎవరికైనా రావచ్చని హెచ్చరించారు. తెలంగాణలో బీజేపీ కార్యకర్తల బలం, ప్రజల మద్దతు రోజురోజుకూ పెరుగుతోందని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీజేపీ సత్తా ఏమిటో చూపిస్తామని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, బీజేపీ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడటం మానుకోవాలని డాక్టర్ బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.




