Nagarkurnool: కృష్ణమ్మ ఒడ్డున ఉన్నా నీళ్లు లేవు అమ్రాబాద్ రైతుల ఆవేదన!
Nagarkurnool: నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ను కృష్ణా నది చుట్టిముట్టినా సాగునీరు అందడం లేదని 60 ఏళ్ల నిరీక్షణకు ముగింపుగా ప్రజా ఉద్యమానికి రైతులు సిద్ధమయ్యారు
Nagarkurnool: కృష్ణమ్మ ఒడ్డున ఉన్నా నీళ్లు లేవు అమ్రాబాద్ రైతుల ఆవేదన!
Nagarkurnool: అమ్రాబాద్, అంగట్లో అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని ఉన్నట్లుగా అమ్రాబాద్ ఉమ్మడి మండల ప్రజల పరిస్థితి మారిందని, చుట్టూ కృష్ణమ్మ ప్రవహిస్తున్నా తమ పొలాలకు సాగునీరు అందక రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలో, కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్న తమకు ఆరు దశాబ్దాలుగా నాయకుల హామీలే తప్ప సాగునీరు అందకపోవడం దురదృష్టకరమని వారు మండిపడ్డారు.
80 కిలోమీటర్ల పరిధిలో కృష్ణమ్మ.. అయినా మా పొలాలకు నీరేది?శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీరు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నా, నది ఒడ్డున ఉన్న అమ్రాబాద్ ఉమ్మడి మండల రైతులకు మాత్రం సాగునీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చెన్నైకి, పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమ ప్రాంతాలకు నీరు తరలించే ప్రణాళికలు అమలవుతున్నాయని, కానీ తమ ప్రాంత రైతుల సాగునీటి సమస్యకు మాత్రం శాశ్వత పరిష్కారం చూపడం లేదని ప్రశ్నించారు.ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే మా ప్రాంతం వారే..
అయినా మా కరువు గోస కనిపించడం లేదా?ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇటీవల జరిగిన సాగునీటి సమీక్షలో ఇప్పటికే అధిక శాతం సాగునీటి సౌకర్యం ఉన్న నల్గొండ జిల్లా అంశాలపై దృష్టి సారిస్తున్నారని, తరతరాలుగా కరువుతో అల్లాడుతున్న అమ్రాబాద్ ఉమ్మడి మండలానికి సాగునీరు అందించే అంశానికి తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం బాధాకరమని నాయకులు పేర్కొన్నారు.ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే ఇద్దరూ ఈ ప్రాంతానికి చెందినవారే అయినప్పటికీ, తమ ప్రాంత సాగునీటి సమస్యకు పరిష్కారం లభించకపోవడం ప్రజలను నిరాశకు గురిచేస్తోందన్నారు. మా కరువు గోస పాలకులకు కనిపించడం లేదా? మా రైతుల కన్నీళ్లు వినిపించడం లేదా? అని ప్రశ్నించారు.
నాడు ఆంధ్ర పాలకుల వివక్ష అన్నారు.. నేడు తెలంగాణలోనూ అదే పరిస్థితా?
గతంలో దుందుభి వాగు, నక్కలగండి, నార్లాపూర్, ఏదుల వంటి ప్రాజెక్టులు, ప్రతిపాదనల పేర్లు వినిపించాయని, కాలం గడుస్తున్నా తమ ప్రాంతానికి సాగునీరు అందించే శాశ్వత పరిష్కారం మాత్రం కనిపించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో సాగునీరు రాకపోవడానికి ఆంధ్ర పాలకుల వివక్ష కారణమని చెప్పారని, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగాల్సిన సమయంలోనూ తమకు నీరు ఎందుకు రావడం లేదని నిలదీశారు. నాడు ఆంధ్ర వివక్షకు గురయ్యామని, నేడు తెలంగాణలోనూ వివక్షకు గురికావాలా? అని ప్రశ్నించారు.
యురేనియం వ్యతిరేక పోరాటం తరహాలో సాగునీటి ఉద్యమం చేపడదాం!అమ్రాబాద్ ఉమ్మడి మండల ప్రజలు, రైతులు, యువకులు, ప్రజాసంఘాల నాయకులు రాజకీయాలకు అతీతంగా ఒక్కటై సాగునీటి హక్కుల కోసం మరో ప్రజా ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. యురేనియం వ్యతిరేక పోరాటంలో ప్రజలు ఏకమై తమ నిరసనను బలంగా వినిపించినట్లుగానే, సాగునీటి సాధన కోసం కూడా ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
ప్రభుత్వం తక్షణమే అమ్రాబాద్ ఉమ్మడి మండల సాగునీటి అవసరాలపై సమగ్ర ప్రణాళిక రూపొందించి, నిధులు కేటాయించి, ప్రాజెక్టుల పనులకు స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇకపై హామీలతో కాలయాపన చేయకుండా, తమకు సాగునీరు అందించే విషయంలో తాడోపేడో తేల్చుకునేలా ప్రజలంతా ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరారు.ఈ సమావేశంలో పాల్గొన్నవారు:
జక్కా బాలకిష్టయ్య (అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి), తెలంగాణ జేఏసీ శ్రీనివాస్, విజయమోహన్, జక్కా బాలయ్య, సామ అనిల్, గాజుల చిన్నకిష్టయ్య, రైతులు జక్కా రామయ్య, రంగయ్య తదితరులు పాల్గొన్నారు.




