Uppununthala: కంసానిపల్లిలో వీధి కుక్కల దాడి.. ఇద్దరికి తీవ్ర గాయాలు!

Uppununthala: అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునుంతల మండలం కంసానిపల్లిలో వీధి కుక్కలు గుంపుగా దాడి చేయడంతో ఇద్దరు గ్రామస్తులకు తీవ్ర గాయాలయ్యాయి.

V. RAVINDR GOUD, ACCHAMPETA
Published on: 19 Nov 2026 4:40 PM IST
Uppununthala
X

Uppununthala: కంసానిపల్లిలో వీధి కుక్కల దాడి.. ఇద్దరికి తీవ్ర గాయాలు!

ఉప్పునుంతల: అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునుంతల మండలం, కంసానిపల్లి గ్రామంలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ తీవ్రమవుతోంది. గ్రామంలో గుంపులుగా తిరుగుతున్న వీధి కుక్కలు రాత్రి వేళ ఇద్దరు వ్యక్తులపై ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ దాడిలో ఇద్దరూ గాయపడ్డారు. అందులో ఒకరికి కాలు మీద లోతైన గాయమై, రక్తస్రావం కూడా అయింది.

గ్రామస్తులు చెబుతున్న వివరాల ప్రకారం, రాత్రి వేళ గ్రామ వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరిపై వీధి కుక్కలు అకస్మాత్తుగా దాడి చేశాయి. కుక్కలు గుంపుగా వచ్చి కాళ్లపై కరవడంతో వారు కిందపడిపోయారు. వారి కేకలు విని చుట్టుపక్కల వారు పరుగున వచ్చి కుక్కలను తరిమి, గాయపడిన వారిని కాపాడారు. లేకపోతే పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని గ్రామస్తులు చెబుతున్నారు.

గాయపడిన వారిని వెంటనే ఉప్పునుంతల మండల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు గాయాలను శుభ్రం చేసి, చికిత్స అందించారు.

కంసానిపల్లిలో ఇప్పటికే వీధి కుక్కల సంఖ్య బాగా పెరిగిపోయింది. ఉదయం, సాయంత్రం వేళల్లో పిల్లలు స్కూల్‌కు వెళ్లే సమయంలో, మహిళలు నీళ్లకు వెళ్లే సమయంలో, వృద్ధులు నడకకు వెళ్లే సమయంలో కుక్కలు గుంపులుగా వెంటపడుతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పిల్లలను ఒంటరిగా బయటకు పంపాలంటేనే భయంగా ఉంది. రోడ్డు మీదకు వెళ్లాలంటే కర్ర పట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఎప్పుడు, ఎక్కడ కుక్కలు దాడి చేస్తాయో తెలియడం లేదు" అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెత్తాచెదారం, మాంసం వ్యర్థాల వల్ల కుక్కలు గ్రామంలోనే తిష్టవేస్తున్నాయని, రాత్రి వేళ మరింత దూకుడుగా ప్రవర్తిస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు.

వెంటనే పశు వైద్య, పంచాయతీ అధికారులు గ్రామానికి వచ్చి వీధి కుక్కలను పట్టుకోవాలి. కుక్కలకు స్టెరిలైజేషన్, రేబిస్ టీకాలు వేయించాలి. గ్రామంలో చెత్త నిర్వహణ సరిగా చేయాలి, మాంసం వ్యర్థాలు రోడ్లపై వేయకుండా చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలి.

అధికారులు స్పందించాలి:

ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, వీధి కుక్కల సమస్యకు తక్షణ పరిష్కారం చూపించాలని కంసానిపల్లి గ్రామ ప్రజలు కోరుతున్నారు. లేకపోతే రేపు చిన్న పిల్లలపై, వృద్ధులపై దాడి జరిగితే ప్రాణాలకే ప్రమాదం అని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.

V. RAVINDR GOUD, ACCHAMPETA

V. RAVINDR GOUD, ACCHAMPETA