Achampet: మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం.. రోగాల బారిన జనం!
Achampet: అచ్చంపేట మున్సిపాలిటీలో అధికారుల నిర్లక్ష్యంతో 'డ్రై డే' అటకెక్కింది. వార్డుల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, దుర్వాసనతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Achampet: మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం.. రోగాల బారిన జనం!
అచ్చంపేట: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో ప్రతి వారం ఒక రోజు 'డ్రై డే' పాటిస్తూ మురికి కాలువలు, అంతర్గత రోడ్లు, పరిసరాలను శుభ్రం చేస్తుంటే, అచ్చంపేట మున్సిపాలిటీలో మాత్రం గత కొన్ని నెలలుగా డ్రై డే కార్యక్రమం అటకెక్కింది. పురపాలక శాఖ ఆదేశాల ప్రకారం డ్రై డే నిర్వహిస్తే మంచి ఫలితాలు వచ్చాయి. కానీ అచ్చంపేటలో అధికారుల నిర్లక్ష్యంతో ఆ కార్యక్రమం అర్ధాంతరంగా నిలిచిపోయిందని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు.
20 వార్డుల్లో పేరుకుపోయిన చెత్త:
అచ్చంపేట పట్టణంలో మొత్తం 20 వార్డులు ఉన్నాయి. కొన్ని కాలనీలలో మురికి కాలువలు సక్రమంగా శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. మున్సిపాలిటీ సిబ్బందికి, కమిషనర్ కు మధ్య సమన్వయం లేకపోవడమే డ్రై డే నిలిచిపోవడానికి కారణమని చర్చ జరుగుతోంది.
మల్లంకుంట రోడ్డులో నరకం:
కూరగాయల మార్కెట్ నుంచి సాయిరాం కాలనీకి వెళ్లే రోడ్డులో, మల్లంకుంట ప్రారంభంలో రోడ్డు పక్కన చికెన్, మటన్, ఇతర వ్యర్థ పదార్థాలు విచ్చలవిడిగా వేస్తున్నారు. ఇదే దారిలో ఎస్సీ గర్ల్స్ హాస్టల్, బీసీ బాలుర హాస్టల్, గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు రాకపోకలు సాగిస్తున్నారు. విపరీతమైన దుర్వాసనతో ముక్కులు మూసుకుని వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.
మల్లంకుంట చివరలో మురుగునీరు నిల్వ ఉండటం వల్ల విష జ్వరాలు, వైరల్ జ్వరాలు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత మున్సిపాలిటీపై ఉందని, కమిషనర్ వెంటనే స్పందించి వారంలో ఒక రోజు డ్రై డే నిర్వహించి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.




