Korratanda: కొర్రతాండ పంచాయతీలో రూ.4.72 లక్షల నిధుల కుంభకోణం
Korratanda: అచ్చంపేట మండలం కొర్రతాండలో రూ.4.72 లక్షల పంచాయతీ నిధులు మాయం. డిజిటల్ సంతకం లేకుండానే నిధులు డ్రా చేశారంటూ కలెక్టర్కు ఉపసర్పంచ్ తులసీరాం ఫిర్యాదు.
Korratanda: కొర్రతాండ పంచాయతీలో రూ.4.72 లక్షల నిధుల కుంభకోణం
కొర్రతాండ: అచ్చంపేట మండలం కొర్రతాండ గ్రామ పంచాయతీ కార్యాలయం లో రూ.4,72,000 నిధులు ఏమయ్యాయో తెలియకుండా పోయాయి. ఈ వ్యవహారంపై ఉప సర్పంచ్ శ్రీ నేనావత్ తులసీరాం జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి (DPO)లకు ఫిర్యాదు చేసిన స్వయంగా విలేకరుల ను కలిసి తెలియజేశారు.
గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులు చేయకుండానే చేశామని చూపించి, తప్పుడు బిల్లులు సృష్టించి, తన డిజిటల్ సంతకం కోసం ఒత్తిడి తెస్తున్నారని, తన సంతకం లేకుండానే నిధులు డ్రా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
1. రూ.4,72,000 నిధులు మాయం:
నా అనుమతి, సమ్మతి లేకుండా సుమారు రూ.4,72,000 బిల్లులు తయారు చేశారు. ఈ నిధులు ఎక్కడ, ఏ పనులకు ఖర్చు చేశారో నాకు తెలియదు. గ్రామంలో చేసినట్లు చెబుతున్న పనులు, భవనాలు, బిల్లులు, వోచర్లు, బ్యాంకు లావాదేవీలు ఏవీ నాకు చూపించడం లేదు.
నా డిజిటల్ సంతకం లేకుండానే డ్రా
గ్రామ పంచాయతీ నిధుల ఖర్చు వివరాలు, పనుల వివరాలు, బిల్లుల కాపీలు నాకు ఇవ్వకుండానే, నా డిజిటల్ సంతకం లేకుండా నిధులను బ్యాంకు నుండి డ్రా చేయడం జరిగింది. ఇది తీవ్ర నేరం.
తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 ప్రకారం ఉప సర్పంచ్ కు కూడా పనులపై హక్కులు ఉంటాయి. కానీ సర్పంచ్ భర్త శాంతు, సంబంధిత అసిస్టెంట్ ఇంజనీర్ తో కుమ్మక్కై, గ్రామంలో ఒక్క ఇటుక కూడా పెట్టకుండానే Measurement Book) లో పని జరిగినట్లు తప్పుడు కొలతలు, ఎంట్రీలు చేసి, తప్పుడు బిల్లులు తయారు చేశారు. ఆ బిల్లులపై నా సంతకం కోసం వచ్చారు. పని జరిగిన తర్వాతే సంతకం పెడతానని నేను చెప్పాను అని పేర్కొన్నారు.
తప్పుడు బిల్లులపై సంతకం పెట్టనన్నందుకు నాపై ఒత్తిడి చేస్తున్నారు. చట్టవిరుద్ధంగా నిధులు డ్రా చేయడం కుదరదని, మొదట పని పూర్తి చేసి ధృవీకరించిన తర్వాతే బిల్లు పెట్టాలని చెబితే, నాపై పై అధికారులకు లేనిపోని ఫిర్యాదులు చేస్తున్నారు.
సర్పంచ్ భర్త అక్రమ జోక్యం
గ్రామ పంచాయతీ పరిపాలనలో సర్పంచ్ భర్త అనవసరంగా జోక్యం చేసుకుంటూ, అధికారాల వినియోగానికి ఆటంకం కలిగిస్తూ, మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఇది పంచాయతీ రాజ్ చట్టానికి విరుద్ధం, పై అంశాలపై సమగ్ర విచారణ జరిపి, రూ.4,72,000 ఖర్చు వివరాలు, MB ఎంట్రీలు, బిల్లులు, బ్యాంకు రికార్డులను సీజ్ చేసి పరిశీలించాలని, తప్పుడు బిల్లులు చేసిన వారిపై, కుమ్మక్కైన AE, సర్పంచ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.




