Achampet: ఆస్తులు పంచినా ఆప్యాయత దక్కలే.. తల్లి కన్నీటి వ్యథ!
Achampet: ఐదుగురు కొడుకులకు ఆస్తులు పంచినా ఆదరణ కరువై, కొడుకు ప్రభుత్వ ఉద్యోగం వల్ల పింఛన్ కోల్పోయిన 85 ఏళ్ల వృద్ధురాలు బాలమ్మ అచ్చంపేట సబ్ కలెక్టర్‌ను ఆశ్రయించింది.
Achampet: ఆస్తులు పంచినా ఆప్యాయత దక్కలే.. తల్లి కన్నీటి వ్యథ!
అచ్చంపేట: అచ్చంపేట మండలం నడింపల్లి గ్రామానికి చెందిన బాలమ్మ (85 ఏళ్లు)కథ ఇది. భర్త నారాయణ 12 ఏళ్ల కిందటే మృతి చెందాడు. అప్పటి నుంచి ఒంటరిగా జీవితాన్ని నెట్టుకొస్తోంది. ఐదుగురు కొడుకులను పెంచి పెద్ద చేసింది. అందరికీ వివాహాలు చేసి, తనకున్న ఆస్తిని, భూమిని సైతం పంచి ఇచ్చింది.
పెద్ద కొడుకు అచ్చంపేటలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండగా, రెండు, మూడో కొడుకులు వ్యవసాయం చేస్తున్నారు. నాలుగో కొడుకు హైదరాబాద్‌లోని టీజీఎన్పీడీసీఎల్లో అసిస్టెంట్ ఇంజినీర్‌గా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. చిన్న కొడుకు కృష్ణ ప్రైవేట్ జీపు డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
ప్రస్తుతం చిన్న కొడుకు వద్దే బాలమ్మ ఉంటోంది. మిగతా కొడుకులు తనను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది.
కొడుకు ఉద్యోగం.. తల్లికి పింఛన్ శాపం:
ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న కొడుకు కారణంగా తనకు వస్తున్న వృద్ధాప్య పింఛన్‌ను తొలగించారని, రేషన్ కార్డు కూడా లేదని బాలమ్మ వాపోయింది. ఉద్యోగం చేస్తున్న కొడుకు కొన్నేళ్లుగా కనీసం పలకరించడం కూడా లేదని చెప్పింది.
సబ్ కలెక్టర్‌తో గోడు:
అధికారుల గడప తొక్కిన అమ్మ - పింఛన్ లేకపోవడంతో మందు బిళ్లలు కొనుక్కోవడానికి, కనీస అవసరాలు తీర్చుకోవడానికి ఇబ్బందులు పడుతూ బాలమ్మ అచ్చంపేట సబ్ కలెక్టర్ సలోని చాబ్రాను కలిసి గోడు వెల్లబోసుకుంది.
తన వయసు, ఆరోగ్య పరిస్థితి, కుటుంబ పరిస్థితులను మానవతా దృక్పథంతో పరిశీలించి వృద్ధాప్య పింఛన్ పునరుద్ధరించాలని, రేషన్ కార్డు మంజూరు చేయాలని వేడుకుంది.
"ఐదుగురు కొడుకులున్నా తనకు చివరకు పింఛన్ కూడా లేకుండా పోయింది. ఐదుగురు కొడుకులను పెంచి పెద్ద చేసిన తల్లి చివరి దశలో కనీస అవసరాల కోసం అధికారుల ఎదుట కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి సమాజానికి ఆలోచింపజేస్తోంది" అని పేపర్లో రాశారు.
బాలమ్మ ఆవేదన:
"దేవుడు నన్ను ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నాడు.. తొందరగా చావు వస్తే బాగుండు. ఐదుగురు కొడుకులున్నా బుకెడు బువ్వ కోసం అడుక్కునే పరిస్థితి వచ్చింది. ఈ బాధ మరెవరికీ రాకూడదు" అంటూ ఆవేదన వెళ్లగక్కింది.
చిన్న కొడుకు కృష్ణ: "మా అమ్మ కోసం ఏదైనా చేస్తాను.. కానీ ఐదుగురు కొడుకులు ఉండి కూడా ఒక్కరమే అమ్మ బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మిగతా అన్నలు ఎందుకు పట్టించుకోవడం లేదు? కనీసం కొత్త ఇల్లు గృహప్రవేశం చేసినా తల్లిని పిలవలేదు? మా అమ్మ ఎంతో మంచిది, ఎవరి జోలికి వెళ్లదు" అని చెప్పాడు.
ఆస్తులు పంచుకున్నప్పుడు గుర్తొచ్చిన తల్లి.. వృద్ధాప్యంలో మాత్రం ఎందుకు భారమైంది? ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న కొడుకుడి అర్హత ప్రభావం వృద్ధురాలి పింఛన్‌పై పడినప్పుడు, ఆమె వాస్తవ జీవన పరిస్థితిని పరిశీలించాల్సిన అవసరం లేదా? బాలమ్మకు పింఛన్, రేషన్ కార్డు మంజూరు చేసి ఆదుకోవడంతో పాటు కన్న తల్లికి కొడుకుల ఆదరణ కూడా దక్కేలా సంబంధిత అధికారులు, కుటుంబ సభ్యులు స్పందించాలని పలువురు కోరుతున్నారు.




