Memory Power: చిన్న వయసులోనే పెరుగుతోన్న మతిమరుపు సమస్య.. అసలు కారణం ఏంటో తెలుసా.?
Memory Power: ఈ మధ్యకాలంలో చిన్న వయసులోనే చాలామంది మతిమరుపు సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. ఏదైనా విషయం చెప్పినా, చదివినా కొద్దిసేపటికే మర్చిపోతున్నారు.
Memory Power: చిన్న వయసులోనే పెరుగుతోన్న మతిమరుపు సమస్య.. అసలు కారణం ఏంటో తెలుసా.?
Memory Power: ఈ మధ్యకాలంలో చిన్న వయసులోనే చాలామంది మతిమరుపు సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. ఏదైనా విషయం చెప్పినా, చదివినా కొద్దిసేపటికే మర్చిపోతున్నారు. అయితే దీనికి మారుతున్న జీవనశైలితో పాటు స్మార్ట్‌ఫోన్ వినియోగం కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు.
చిన్న వయసులోనే మతిమరుపు ఎందుకు వస్తోంది?
ప్రస్తుతం మనం పూర్తిగా డిజిటల్ ప్రపంచంలో జీవిస్తున్నాం. ఏదైనా ముఖ్యమైన సమాచారం కనిపిస్తే వెంటనే స్క్రీన్‌షాట్ తీసుకుంటున్నాం. చదవాల్సిన ఆర్టికల్స్‌ను బుక్‌మార్క్ చేస్తున్నాం. గుర్తుంచుకోవాల్సిన విషయాలను మొబైల్ నోట్స్‌లో రాసుకుంటున్నాం. ముఖ్యమైన పనుల కోసం రిమైండర్లు పెట్టుకుంటున్నాం. ఇలా ప్రతిదానికీ స్మార్ట్ఫోన్పైనే ఆధారపడుతున్నాం.
అయితే ఇలా సేవ్ చేసుకున్న సమాచారాన్ని తర్వాత నిజంగా తిరిగి చూస్తున్నామా? అందులోని విషయాలు మనకు గుర్తున్నాయా? అనే విషయాలను చాలామంది పట్టించుకోవడం లేదు. దీనికి తోడు తరచూ వచ్చే మొబైల్ నోటిఫికేషన్లు, ఒకేసారి అనేక పనులు చేయడం, గంటల తరబడి సోషల్ మీడియా చూడటం వంటివి కూడా మన ఏకాగ్రతను దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా కొత్త విషయాలను నేర్చుకోవడం, వాటిని గుర్తుంచుకోవడం కష్టమవుతోంది.
డిజిటల్ ఆఫ్‌లోడింగ్ అంటే ఏమిటి?
మొబైల్ లేదా ఇతర డిజిటల్ పరికరాల సాయంతో సమాచారాన్ని గుర్తుంచుకునే బాధ్యతను మన మెదడు నుంచి వాటికి బదిలీ చేయడాన్ని 'డిజిటల్ ఆఫ్‌లోడింగ్' అంటారు. ఉదాహరణకు ఫోన్ నంబర్లు గుర్తుపెట్టుకోకుండా కాంటాక్ట్స్‌లో సేవ్ చేసుకోవడం, ముఖ్యమైన తేదీలను క్యాలెండర్లో నమోదు చేయడం, చేయాల్సిన పనులన్నింటినీ రిమైండర్లలో పెట్టుకోవడం వంటివి ఇందులోకి వస్తాయి.
ఈ విధానం వల్ల సమయం ఆదా అవుతుంది. అవసరమైన సమాచారాన్ని సులభంగా తిరిగి పొందవచ్చు. అయితే ప్రతి చిన్న విషయానికి టెక్నాలజీపైనే ఆధారపడితే సొంతంగా గుర్తుంచుకునే అలవాటు తగ్గే అవకాశం ఉంది. ఏదైనా విషయాన్ని మొబైల్లో సేవ్ చేసుకోవడం అంటే దాన్ని పూర్తిగా నేర్చుకున్నట్లు కాదు. అలాగే ఒక పుస్తకాన్ని చదవడం మాత్రమే దానిలోని విషయాలు మనకు గుర్తుండిపోతాయని చెప్పలేం. వాటిని అర్థం చేసుకుని, గుర్తు చేసుకునే ప్రయత్నం చేసినప్పుడే జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.
నిపుణులు ఏం చెబుతున్నారు?
మన జ్ఞాపకశక్తి అనేది ముందుగా ఏదైనా విషయంపై దృష్టి పెట్టడం నుంచి ప్రారంభమవుతుంది. ఒక సమాచారాన్ని ఎక్కువకాలం గుర్తుంచుకోవాలంటే ముందుగా దానిపై ఏకాగ్రత చూపాలి. ఆ తర్వాత దాన్ని అర్థం చేసుకుని మెదడులో నిక్షిప్తం చేసుకోవాలి. ఈ ప్రక్రియ సరిగ్గా జరిగినప్పుడే ఆ సమాచారం ఎక్కువకాలం గుర్తుంటుంది. అయితే నిరంతరం వచ్చే నోటిఫికేషన్లు, ఒకేసారి అనేక పనులు చేయడం, ఆగకుండా సోషల్ మీడియా స్క్రోల్ చేయడం వల్ల ఏకాగ్రత తగ్గుతుంది. దీనివల్ల సమాచారాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం, గుర్తుంచుకోవడం కష్టమవుతుంది. అయితే టెక్నాలజీని పూర్తిగా దూరం పెట్టాల్సిన అవసరం లేదు. రిమైండర్లు, క్యాలెండర్లు, డిజిటల్ నోట్స్ వంటివి మనకు ఉపయోగపడతాయి. వాటిపై పూర్తిగా ఆధారపడకుండా సొంతంగా ఆలోచించడం, విషయాలను గుర్తు చేసుకోవడం కూడా అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
జ్ఞాపకశక్తి పెరగాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి
మతిమరుపు సమస్యను తగ్గించుకోవడానికి రోజువారీ అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా మెదడుకు పని చెప్పే విధంగా మన దినచర్య ఉండాలి.
* ఏదైనా కొత్త విషయం నేర్చుకున్న తర్వాత పుస్తకం లేదా మొబైల్ చూడకుండా దాన్ని గుర్తు చేసుకునే ప్రయత్నం చేయాలి.
* ఏకాగ్రతతో చదవాలి: చదివేటప్పుడు మొబైల్ నోటిఫికేషన్లను ఆఫ్ చేసి, ఇతర పనులపై దృష్టి పెట్టకుండా ఉండాలి.
* సొంత మాటల్లో చెప్పాలి: నేర్చుకున్న విషయాలను ఇతరులకు వివరించడం లేదా మనసులోనే మరోసారి చెప్పుకోవడం వల్ల అవి ఎక్కువకాలం గుర్తుండే అవకాశం ఉంటుంది.
* సంభాషణలు పెంచుకోవాలి: కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడటం, కొత్త విషయాలు తెలుసుకోవడం వంటి అలవాట్లు కొనసాగించాలి.
* తగినంత నిద్ర: మెదడు చురుగ్గా పనిచేయడానికి ప్రతిరోజూ సరిపడా నిద్ర అవసరం.
* మొబైల్ వినియోగం తగ్గించాలి: అవసరమైనప్పుడు మాత్రమే ఫోన్ ఉపయోగిస్తూ, అనవసరంగా సోషల్ మీడియా చూసే సమయాన్ని తగ్గించాలి.
మొత్తంగా చూస్తే మనం ఎంత సమాచారాన్ని మొబైల్లో దాచుకుంటున్నామన్నది ముఖ్యం కాదు. అందులో ఎంత సమాచారాన్ని అర్థం చేసుకుని గుర్తుంచుకుంటున్నామన్నదే ముఖ్యం. కాబట్టి టెక్నాలజీని ఉపయోగించుకుంటూనే మన జ్ఞాపకశక్తికి కూడా తగినంత పని చెప్పాలి. అయితే మతిమరుపు సమస్య తరచుగా ఎదురవుతూ రోజువారీ పనులకు ఇబ్బంది కలిగిస్తుంటే వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.




