Monk Fruit: జీరో క్యాలరీ.. షుగర్ ఫ్రీ.. మాంక్ ఫ్రూట్ వాడితే బరువు తగ్గుతారా?

Monk Fruit: ప్రస్తుత కాలంలో తెల్ల చక్కెరకు బదులుగా ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను వెతికే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది.

CR Reddy
Published on: 15 Oct 2026 11:12 AM IST
Monk Fruit
X

Monk Fruit

Monk Fruit: ప్రస్తుత కాలంలో తెల్ల చక్కెరకు బదులుగా ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను వెతికే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. చక్కెలను తెల్ల విషంగా భావిస్తూ చాలామంది నేచురల్ స్వీటెనర్ల వైపు అడుగులు వేస్తున్నారు. అలాంటి వాటిలో మాంక్ ఫ్రూట్ ప్రస్తుతం బాగా ప్రాచుర్యం పొందింది. ఇది జీరో-క్యాలరీ, బ్లడ్ షుగర్‌ను పెంచని ఉత్తమ ప్రత్యామ్నాయమని మార్కెట్లో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇది నిజంగానే ఆరోగ్యానికి అంత మంచిదా లేక కేవలం ఖరీదైన వ్యాపార మోసమా అనే విషయంపై ఆరోగ్య నిపుణులు పలు కీలక విషయాలు వెల్లడించారు.

అసలు ఇది ఎక్కడ దొరుకుతుంది?

దక్షిణ చైనా ప్రాంతంలో ఎక్కువగా లభించే ఈ పండ్లను లూయో హాన్ గువో అని కూడా పిలుస్తారు.ఈ పండులో ఉండే మొగ్రోసైడ్స్ అనే యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాల వల్లే దీనికి విపరీతమైన తీపి వస్తుంది. ఇవి సాధారణ చక్కెర కంటే వందల రెట్లు ఎక్కువ తీపిదనాన్ని కలిగి ఉంటాయి. అయితే డైటీషియన్ శిఖా సింగ్ చెబుతున్న ప్రకారం.. మాంక్ ఫ్రూట్ కేవలం తీపి కోసం మాత్రమే ఉపయోగపడే ఒక నాన్-న్యూట్రీషన్ స్వీటెనర్ మాత్రమే. దీనివల్ల శరీరానికి ప్రత్యేకంగా విటమిన్లు లేదా మినరల్స్ ఏవీ అందవు. కంపెనీలు దీన్ని సూపర్ ఫుడ్ లా ప్రచారం చేస్తున్నప్పటికీ, ఇందులో పోషకాలు పెద్దగా ఉండవు.

జీరో షుగర్, జీరో క్యాలరీ మధ్య తేడా

మార్కెట్లో లభించే ప్రతి మాంక్ ఫ్రూట్ ప్యాకెట్ పూర్తిగా స్వచ్ఛమైనది కాకపోవచ్చు. డాక్టర్ ఆశిష్ జైస్వాల్ తెలిపిన వివరాల ప్రకారం, ప్యాకెట్ల మీద నో షుగర్ లేదా జీరో క్యాలరీ అని రాసి ఉన్నప్పటికీ, వాటిలో ఎరిత్రితోల్, డెక్స్ట్రోస్, డెక్స్ట్రిన్ వంటి ఇతర ఫిల్లర్లు కలిపే అవకాశం ఉంటుంది. అందువల్ల కొనుగోలు చేసే ముందు ప్యాకెట్ వెనుక ఉన్న ఇంగ్రిడియంట్స్ లిస్ట్ చదవడం చాలా ముఖ్యం. కొన్ని ఉత్పత్తులలో మాంక్ ఫ్రూట్ శాతం చాలా తక్కువగా ఉండి, మిగతాదంతా ఇతర కృత్రిమ స్వీటెనర్లతో నింపి ఉంటారు.

బరువు తగ్గడంలో, డయాబెటిస్‌లో దీని పాత్ర

మాంక్ ఫ్రూట్ అకర్షకం సాధారణ చక్కెరలా రక్తంలోని చక్కెర స్థాయిలను వేగంగా పెంచదు. అందువల్ల సరైన ఫార్ములేషన్ ఉన్న ఉత్పత్తులను డయాబెటిస్ బాధితులు పరిమితంగా వాడవచ్చు. అయితే ఇది నేరుగా బరువు తగ్గించదు. కేవలం టీ లేదా కాఫీలో సాధారణ చక్కెరకు బదులుగా దీన్ని వాడటం వల్ల రోజూ తీసుకునే కేలరీల మోతాదు తగ్గుతుంది. అలా పరోక్షంగా బరువు నియంత్రణలో సహాయపడుతుందే తప్ప, ఇది మ్యాజికల్ ప్రొడక్ట్ కాదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. డయాబెటిస్ నియంత్రణకు మందులు, సరైన ఆహారపు అలవాట్లే ప్రధానమని గుర్తుంచుకోవాలి.

దీర్ఘకాలిక వాడకం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్

ఈ స్వీటెనర్‌ను అధికంగా వాడటం వల్ల కొంతమందిలో గ్యాస్, కడుపు ఉబ్బరం, కడుపులో నొప్పి లేదా లూజ్ మోషన్స్ వంటి సమస్యలు రావచ్చు. దీనిలో కలిపే కొన్ని రకాల పదార్థాలు సెన్సిటివ్ కడుపు ఉన్నవారికి ఇబ్బంది కలిగించవచ్చు. అంతేకాకుండా, గర్భిణీ స్త్రీలు, పిల్లలపై దీని దీర్ఘకాలిక ప్రభావం గురించి పూర్తి స్థాయి మానవ ఆధారిత శాస్త్రీయ అధ్యయనాలు ఇంకా అందుబాటులో లేవు. మార్కెట్లో దీని ధర కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. తక్కువగా లభించడం మరియు ప్రాసెసింగ్ ఖర్చు కారణంగా దీని రేటు పెరిగినప్పటికీ, ఖరీదైనది అయినంత మాత్రాన అది ఎక్కువ పోషకాలను ఇస్తుందని చెప్పలేం. మొత్తానికి చక్కెరకు పూర్తిగా స్వస్తి పలకాలంటే నిత్య జీవితంలో మొత్తం చక్కెర వినియోగాన్ని తగ్గించడమే ఉత్తమ మార్గమని నిపుణులు సూచిస్తున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.