Gut Health Tips: ఫైబర్ విషయంలో భారతీయులు చేసే పెద్ద తప్పులు ఇవే
Gut Health Tips: మనం నిత్యం తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు, క్యాలరీలు, విటమిన్ల గురించి ఆలోచించినట్లుగా పీచు పదార్థం(ఫైబర్) గురించి అస్సలు ఆలోచించం.
Gut Health Tips
Gut Health Tips: మనం నిత్యం తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు, క్యాలరీలు, విటమిన్ల గురించి ఆలోచించినట్లుగా పీచు పదార్థం(ఫైబర్) గురించి అస్సలు ఆలోచించం. జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయాలన్నా, కడుపు శుభ్రంగా ఉండాలన్నా, బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్ అదుపులో ఉండాలన్నా ఫైబర్ అత్యంత ముఖ్యం. అయితే మనదేశంలో చాలామంది ప్రతిరోజూ ఫైబర్ తీసుకోవడంలో తీవ్రమైన పొరపాట్లు చేస్తున్నారని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రోజువారీ ఆహారంలో ఫైబర్ లోపించడం
డాక్టర్లు తెలిపిన వివరాల ప్రకారం.. చాలామంది భారతీయులు చేసే అతిపెద్ద పొరపాటు తగినంత ఫైబర్ తీసుకోకపోవడమే. మన రోజువారీ ఆహారంలో తెల్లటి అన్నం, మైదాతో చేసిన పదార్థాలు, ప్రాసెస్ చేసిన ప్యాకేజ్డ్ స్నాక్స్ ఎక్కువగా ఉంటున్నాయి. పప్పుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, తాజా పండ్లు, తృణధాన్యాలు తీసుకోవడం బాగా తగ్గిపోవడం వల్ల జీర్ణసంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి.
కేవలం సలాడ్స్లోనే ఫైబర్ ఉంటుందనే అపోహ
చాలామంది ఫైబర్ అనగానే కేవలం సలాడ్స్ లేదా పచ్చి కూరగాయలు మాత్రమే తింటే వస్తుందని భావిస్తారు. ఇది పూర్తిగా తప్పు. పప్పులు, సెనగలు, రాజ్మా, ఓట్స్, చిరుధాన్యాలు(మిల్లెట్స్), నట్స్, విత్తనాలు, తాజా పండ్లలో కూడా ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. కేవలం సలాడ్స్ తినడం కాకుండా రోజువారీ భోజనంలో రకరకాల పప్పులు, తృణధాన్యాలను భాగం చేసుకోవడం ద్వారా శరీరానికి కావలసినంత పీచు పదార్థం సులభంగా అందుతుంది.
ఒక్కసారిగా ఫైబర్ మోతాదు పెంచడం
మలబద్ధకం లేదా కడుపు ఉబ్బరం రాగానే కొందరు ఒక్కసారిగా ఎక్కువ మొత్తంలో ఫైబర్ ఉన్న ఆహారాన్ని తినడం ప్రారంభిస్తారు. దీనివల్ల పొట్టలో గ్యాస్, ఉబ్బరం, కడుపునొప్పి లాంటి సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి. ఫైబర్ తీసుకునే మోతాదును రోజురోజుకూ నిదానంగా పెంచుకుంటూ పోవాలి. దీనికి తోడు రోజంతా సరిపడా మంచి నీళ్లు తాగడం వల్ల మాత్రమే ఫైబర్ సరిగ్గా జీర్ణమై శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
తొక్కు తీసి తినడం.. రిఫైన్డ్ ఫుడ్ వాడకం
కూరగాయలు, పండ్ల పైన ఉండే తొక్కల్లో అత్యధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. చాలామంది అనవసరంగా తొక్కను తీసి పడేస్తుంటారు. దీనివల్ల ఫైబర్ పోతుంది. అలాగే పాలిష్ చేసిన బియ్యం, గోధుమ పిండి కాకుండా హోల్ గ్రెయిన్స్ వాడటం అలవాటు చేసుకోవాలి. రోజూ ఒకట్రెండు పండ్లు తినడం, పప్పుధాన్యాలను భాగం చేసుకోవడం మంచిది. కడుపు ఉబ్బరం లేదా మలబద్ధకం సమస్యలు నిరంతరం వేధిస్తుంటే సొంత వైద్యం చేసుకోకుండా డాక్టర్ను కలవడం శ్రేయస్కరం.




