Smart Toothbrush: బ్రష్ చేస్తే విద్యుత్ ఉత్పత్తి.. బ్యాక్టీరియాను తగ్గించే కొత్త టూత్ బ్రష్

Smart Toothbrush: దంతాల మధ్య ఉండే మురికిని, క్రిములను తొలగించడానికి సాధారణంగా మనమందరం టూత్‌పేస్ట్, టూత్‌బ్రష్ ఉపయోగిస్తుంటాం.

CR Reddy
Published on: 7 Nov 2026 9:46 AM IST
Smart Toothbrush: బ్రష్ చేస్తే విద్యుత్ ఉత్పత్తి.. బ్యాక్టీరియాను తగ్గించే కొత్త టూత్ బ్రష్
X

Smart Toothbrush: ఉదయాన్నే నిద్రలేవగానే బ్రష్ చేసుకోవడం మన రోజువారీ జీవితంలో ఒక భాగం. దంతాల మధ్య ఉండే మురికిని, క్రిములను తొలగించడానికి సాధారణంగా మనమందరం టూత్‌పేస్ట్, టూత్‌బ్రష్ ఉపయోగిస్తుంటాం. కానీ మనం వాడే టూత్‌బ్రష్ ఎలాంటి బ్యాటరీ సాయం లేకుండా తనంతట తాను స్వయంగా కరెంట్‌ను ఉత్పత్తి చేసి, నోట్లోని ప్రమాదకర బ్యాక్టీరియాను హతమార్చగలదని ఎప్పుడైనా ఊహించారా? వినడానికి సైన్స్ ఫిక్షన్ సినిమా కథలా అనిపించినప్పటికీ శాస్త్రవేత్తలు సరిగ్గా ఇటువంటి అత్యాధునిక సాంకేతికతతో కూడిన కొత్త రకం టూత్‌బ్రష్‌ను తయారు చేశారు.

బయటి నుంచి కరెంట్ అవసరం లేని ప్రత్యేక డిజైన్

ఈ కొత్త టూత్‌బ్రష్ పని చేయడానికి ఎలాంటి బ్యాటరీలు లేదా ఛార్జింగ్ అవసరం లేకపోవడం దీని ప్రత్యేకత. దంతాలను శుభ్రం చేయడానికి బ్రష్‌ను అటు ఇటు కదిలించినప్పుడు ఉత్పన్నమయ్యే ఒత్తిడిని ఉపయోగించుకుని ఇది కరెంట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బ్రష్‌లోని వెంట్రుకల వంటి పీచును పాలివినైలిడీన్ ఫ్లోరైడ్ అనే ప్రత్యేక పదార్థంతో తయారు చేశారు. ఈ పదార్థం వంగినప్పుడు లేదా దానిపై ఒత్తిడి పడినప్పుడు స్వల్ప పరిమాణంలో విద్యుత్‌ను విడుదల చేసే ధర్మం కలిగి ఉంటుంది. ఈ ప్రక్రియను విజ్ఞాన శాస్త్రంలో పైజోఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అని పిలుస్తారు.

రసాయన చర్యతో బ్యాక్టీరియాపై దాడి

బ్రష్ చేయడం వల్ల ఈ పీచు నిరంతరం వంగుతూ ఉంటుంది. ఆ కదలికల నుంచి ఉత్పన్నమయ్యే స్వల్ప విద్యుత్ నోటిలోని లాలాజలం, నీటితో కలిసి ఒక రసాయన చర్యను జరుపుతుంది. ఈ చర్య ఫలితంగా రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషిస్ అనే చురుకైన అణువులు తయారవుతాయి. ఇవి దంతాలకు హాని కలిగించే ప్రమాదకర బ్యాక్టీరియా కణాల వ్యవస్థను పూర్తిగా దెబ్బతీస్తాయి. ప్రధానంగా దంతాల్లో పిప్పి పళ్లకు కారణమయ్యే స్ట్రెప్టోకోకస్ మ్యూటన్స్ బ్యాక్టీరియాతో పాటు, చిగుళ్ల వ్యాధులకు కారణమయ్యే పోర్ఫిరోమోనాస్ జింజివాలిస్ బ్యాక్టీరియాపై ఈ విద్యుత్ ప్రభావం చూపుతుంది.

115 మందిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన సైంటిస్టులు

ల్యాబ్‌లో జరిపిన ప్రయోగాల్లో పిప్పి పళ్లను కలిగించే బ్యాక్టీరియాను ఈ బ్రష్ 50 శాతానికి పైగా, చిగుళ్ల సమస్యల బ్యాక్టీరియాను ఏకంగా 78 శాతం వరకు సమర్థవంతంగా తగ్గించినట్లు తేలింది. ఈ సాంకేతికత పనితీరును నిర్ధారించుకోవడానికి శాస్త్రవేత్తలు 115 మంది బాధితులపై మూడు నెలల పాటు క్లినికల్ పరీక్షలు నిర్వహించారు. సాధారణ నైలాన్ బ్రష్ వాడిన వారితో పోలిస్తే, ఈ కొత్త బ్రష్ ఉపయోగించిన వారిలో దంతాల ప్లాక్ తయారీ తగ్గడంతో పాటు చిగుళ్ల నుంచి రక్తం కారడం, వాపులు వంటి సమస్యలు గణనీయంగా తగ్గాయి.

నోటి దుర్వాసన నుంచి పూర్తి రక్షణ

ఈ పరిశోధనల ద్వారా నోటిలో ఉండే హానికర బ్యాక్టీరియా శాతం తగ్గి, మేలు చేసే బ్యాక్టీరియా శాతం పెరిగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఫలితంగా నోటి దుర్వాసన సమస్య కూడా శాశ్వతంగా తగ్గే అవకాశం ఏర్పడుతుంది. ప్రస్తుతం ఇది ప్రయోగశాల దశ దాటి క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకుంది. త్వరలోనే తగిన రక్షణ పరీక్షలు పూర్తి చేసి సాధారణ ప్రజల కొనుగోలుకు అందుబాటులోకి తీసుకురావాలని పరిశోధకులు ప్రణాళికలు వేస్తున్నారు. దంత వైద్య రంగంలో ఈ కొత్త ఆవిష్కరణ ఒక మైలురాయిగా నిలవనుంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.