Health Tips: శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. లేదంటే ఆస్పత్రికే.!
Health Tips: ఛాతీలో మంట, నోటిలో పుల్లని రుచి, లేదా కడుపు ఉబ్బరం తరచుగా బాధిస్తున్నాయా? అయితే వీటిని సాధారణ గ్యాస్ సమస్యగా భావించి అస్సలు నిర్లక్ష్యం చేయకండి.
Health Tips: శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. లేదంటే ఆస్పత్రికే.!
Health Tips: మారుతున్న జీవనశైలి, సమయపాలన లేని ఆహారపు అలవాట్ల కారణంగా నేటి కాలంలో చాలా మంది జీర్ణకోశ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే, కడుపులో ఉబ్బరం లేదా ఛాతీలో మంట లాంటివి వస్తే సాధారణ గ్యాస్ సమస్యే కదా అని చాలామంది వాటిని తేలికగా తీసుకుంటారు. కానీ, ఇలాంటి లక్షణాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని ఆరోగ్య నిపుణులు, వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇవి 'యాసిడ్ రిఫ్లక్స్' వ్యాధికి సంబంధించిన ప్రాథమిక సంకేతాలని, సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ఇవి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని స్పష్టం చేస్తున్నారు.
వైద్యులు చెబుతున్న వివరాల ప్రకారం.. ఛాతీలో మంటగా అనిపించడం, నోటిలో తరచుగా పుల్లని రుచి రావడం, కడుపు ఉబ్బరంగా ఉండటం, పదేపదే త్రేన్పులు రావడం లాంటివి యాసిడ్ రిఫ్లక్స్ ప్రాథమిక సంకేతాలు. పొట్టలో ఉత్పత్తి అయ్యే ఆమ్లాలు పైకి ఎగదన్నడం వల్లే ఈ సమస్య తలెత్తుతుంది. దీనివల్ల ఆహారం తిన్న తర్వాత కడుపునొప్పి రావడం, వికారం, అలాగే గొంతులో ఏదో అడ్డుపడినట్లు అనిపించి పొడిదగ్గు, గొంతు చికాకు కూడా కలుగుతాయని వైద్యులు వివరిస్తున్నారు.
ఒకవేళ ఈ ప్రాథమిక లక్షణాలను గుర్తించిన వెంటనే జీవనశైలిని మార్చుకుని, తగిన చికిత్స తీసుకోకపోతే సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. వ్యాధి తీవ్రత మరింత పెరిగితే స్వరతంత్రులు వాచిపోవడం, అకస్మాత్తుగా బరువు తగ్గడం, నల్లటి మలం రావడం, రాత్రిళ్లు నిద్రలేమి వస్తాయని డాక్టర్లు తీవ్రంగా హెచ్చరించారు. కాబట్టి ఈ లక్షణాల పట్ల ప్రజలు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.




