Kurnool: కర్నూలులో వైఎస్సార్సీపీ కీలక సమావేశం స్థానిక పోరుపై దిశానిర్దేశం!
Kurnool: కర్నూలులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లా వైఎస్సార్సీపీ కీలక సమావేశం. స్థానిక సంస్థల ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం.
Kurnool: కర్నూలులో వైఎస్సార్సీపీ కీలక సమావేశం స్థానిక పోరుపై దిశానిర్దేశం!
Kurnool: రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో ఉమ్మడి కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ నేతల కీలక సమావేశం జరిగింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై నేతలకు దిశానిర్దేశం చేశారు.
సమావేశానికి కర్నూలు, నంద్యాల జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్‌రెడ్డి, కాటసాని రామభూపాల్ రెడ్డి తో పాటు ఎమ్మెల్సీలు కల్పలతారెడ్డి, ఇసాక్‌భాష, మధుసూదన్, నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, ముఖ్య నాయకులు హాజరయ్యారు.
కాటసాని రామభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అన్ని స్థానాల్లో బలంగా పోటీ చేస్తుందని తెలిపారు. పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేసి క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్సీపీ బలాన్ని మరింత పెంచాలని పిలుపునిచ్చారు.
పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం మానుకోవాలి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలను వేధిస్తే చూస్తూ ఊరుకోమని, అక్రమ కేసులు, వేధింపులకు పాల్పడుతున్న అధికారులపై న్యాయపోరాటం చేస్తామని కాటసాని స్పష్టం చేశారు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, పాణ్యం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై అక్రమ కేసులు నమోదు చేయడం సరికాదన్నారు.
హామీలు అమలు చేయలేక వైఎస్ఆర్సీపీపై కేసులా? అంటూ కాటసాని ప్రశ్నించారు. టీడీపీ కూటమి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. సూపర్ సిక్స్’ అమలు చేశామని చెప్పడం కాదు.. ప్రజల జీవితాల్లో ఆ పథకాల ప్రభావం కనిపించాలి. ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తమ తీర్పుతో సమాధానం చెబుతారని కాటసాని అన్నారు.
పోలీస్ వ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలను ఎదుర్కోవాలని కూటమి నేతలకు కాటసాని రామభూపాల్ రెడ్డి సూచించారు.




