Devanakonda: లోకల్, నాన్ లోకల్ కాదు.. గ్రామ అభివృద్ధే ముఖ్యం!

Devanakonda: లోకల్, నాన్ లోకల్ భేదాలు కాకుండా గ్రామ అభివృద్ధే ముఖ్యమని దేవనకొండ కూటమి సర్పంచ్ అభ్యర్థి కట్టా వేణుగోపాలరావు మంగళవారం విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు.

G Jagadeesh, Pathikonda
Published on: 17 Nov 2026 9:26 PM IST
Devanakonda
X

Devanakonda: లోకల్, నాన్ లోకల్ కాదు.. గ్రామ అభివృద్ధే ముఖ్యం!

దేవనకొండ: గ్రామంలో స్థానికుడు.. స్థానికేతరుడు అనే భేదాలు అవసరం లేదని, గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యమని దేవనకొండ గ్రామ కూటమి సర్పంచ్ అభ్యర్థి కట్టా వేణుగోపాలరావు అన్నారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

మంగళవారం దేవనకొండలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ కూటమి తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించడం సంతోషంగా ఉందన్నారు. అయితే గత నాలుగు రోజులుగా కొందరు నాయకులు తమపై అనవసర విమర్శలు చేస్తూ, గ్రామంలో అపోహలు సృష్టిస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎలాంటి పదవులు లేకపోయినా గతంలోనూ మానవతా దృక్పథంతో గ్రామ ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. గ్రామస్తులు తమ దృష్టికి తీసుకొచ్చిన ప్రతి సమస్యను తమ సమస్యగా భావించి పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేశామన్నారు. గత 40 సంవత్సరాలుగా దేవనకొండలోనే నివసిస్తూ స్వయంకృషితో ఎదిగామని, అన్ని కులాలు, సామాజిక వర్గాల ప్రజలకు అండగా ఉంటూ సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాములయ్యామని పేర్కొన్నారు.

గ్రామంలోని దేవాలయాలు, పాఠశాలలు, ఇతర సామాజిక అభివృద్ధి కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందించామని చెప్పారు. పదవులను అడ్డుపెట్టుకొని అక్రమ సంపాదన చేసుకోవాలనే ఆలోచన తమకు లేదని, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలనే సంకల్పంతోనే సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచామని వెల్లడించారు.

"లోకల్.. నాన్ లోకల్ అనే చర్చలు పక్కనపెట్టి గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి. కష్టకాలంలో తమకు అండగా నిలిచిన దేవనకొండ ప్రజలకు మరింత మంచి చేయాలనే ఉద్దేశంతోనే పోటీ చేస్తున్నాం. ఎవరెన్ని విమర్శలు చేసినా ప్రజలు వాటిని నమ్మకుండా, అభివృద్ధి చేసే వారిని ఆదరించాలి. గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు మాకు ఒక అవకాశం కల్పించాలని కోరుతున్నాం" అని కట్టా వేణుగోపాలరావు విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బండి గింజల రంగన్న, ఆకుల వీరేష్, జనసేన నాయకులు ఉచిరప్ప, బుసల రామాంజి, సరోజిని, శిలివెరి శ్రీరాములు, రామాంజిని, ముద్దన సదాశివరావు, వార్డు సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

G Jagadeesh, Pathikonda

G Jagadeesh, Pathikonda