Nandyal: డయాబెటిస్ బాధితులు జాగ్రత్త: డా. శ్రీకాంత్ రాజు
Nandyal: మధుమేహ బాధితుల్లో కాళ్లకు రక్తప్రసరణ తగ్గితే పీఏడీ ముప్పు పొంచి ఉందని, నిర్లక్ష్యం చేస్తే కాలు తీసే పరిస్థితి వస్తుందని డాక్టర్ శ్రీకాంత్ రాజు హెచ్చరించారు.
Nandyal: డయాబెటిస్ బాధితులు జాగ్రత్త: డా. శ్రీకాంత్ రాజు
నంద్యాల జిల్లా: డయాబెటిస్ బాధితులు తస్మాత్ జాగ్రత్త! మధుమేహం కారణంగా కాళ్లకు రక్తప్రసరణ తగ్గితే తీవ్ర పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాదాలకు చిన్న గాయం అయినా నిర్లక్ష్యం చేస్తే అది తీవ్రమైన పుండుగా మారి, చివరకు కాలు తొలగించాల్సిన పరిస్థితి రావచ్చని చెబుతున్నారు.
పిరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్.. పీఏడీపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు. ఈ అంశంపై నంద్యాలలో జరిగిన విలేకరుల సమావేశంలో యశోద హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ వాస్క్యులర్ అండ్ ఎండోవాస్క్యులర్ సర్జన్, క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ ఎస్. శ్రీకాంత్ రాజు కీలక సూచనలు చేశారు.
డయాబెటిస్ రోగుల్లో కాళ్లకు రక్తప్రసరణ తగ్గడం.. అంటే పీఏడీ సమస్యను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని డాక్టర్ శ్రీకాంత్ రాజు స్పష్టం చేశారు. మధుమేహం ఉన్నవారిలో రక్తనాళాలు దెబ్బతినడంతో పాటు నరాల సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. దీంతో పాదాలకు గాయాలైనప్పుడు నొప్పి తెలియకపోవచ్చని, చిన్న గాయాలు సైతం మానకుండా తీవ్రమైన పుండ్లుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
నడిచేటప్పుడు కాళ్లలో నొప్పి రావడం, కాళ్లు త్వరగా అలసిపోవడం, పాదాలు చల్లగా ఉండటం, దీర్ఘకాలంగా గాయాలు మానకపోవడం, పాదాల వేళ్లు నల్లబడటం వంటి లక్షణాలను గుర్తించాలని సూచించారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపారు.
కాళ్లకు రక్తప్రసరణను అంచనా వేసే పరీక్షలు, డాప్లర్ స్కాన్ ద్వారా సమస్యను ముందుగానే గుర్తించవచ్చన్నారు. రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రణలో ఉంచుకోవడంతో పాటు పొగతాగడం పూర్తిగా మానేయాలని సూచించారు. అవసరాన్ని బట్టి మందులతో పాటు యాంజియోప్లాస్టీ వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయని వివరించారు.
ముఖ్యంగా డయాబెటిస్ బాధితులు ప్రతిరోజూ తమ పాదాలను పరిశీలించుకోవాలని, గాయాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య సలహా తీసుకోవాలని సూచించారు.ముందస్తు అవగాహన, సకాలంలో పరీక్షలు, సరైన చికిత్సతో కాలు కోల్పోయే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని డాక్టర్ శ్రీకాంత్ రాజు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ యూనిట్ డీజీఎం సంతోష్ కుమార్, మేనేజర్ సుమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




