Kurnool: కర్నూలులో రోడ్లపై గుంతలు తవ్విస్తే కఠిన చర్యలు.. మున్సిపల్ కమిషనర్!
Kurnool: కర్నూలు నగరంలో శుభకార్యాల కోసం రోడ్లపై గుంతలు తవ్వితే భారీ జరిమానాలు. కాంక్రీట్ స్టాండ్లను మాత్రమే వాడాలని మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు హెచ్చరిక.
Kurnool: కర్నూలులో రోడ్లపై గుంతలు తవ్విస్తే కఠిన చర్యలు.. మున్సిపల్ కమిషనర్!
Kurnool: నగరంలో వివాహాలు, నిశ్చితార్థాలు, గృహప్రవేశాలు, పూజా కార్యక్రమాలు, జన్మదిన వేడుకలు, ఇతర శుభకార్యాలను నిర్వహించే క్రమంలో షామియానాలు, పందిళ్లు ఏర్పాటు చేసేటప్పుడు రహదారులకు ఎలాంటి నష్టం కలగకుండా కాంక్రీట్ స్టాండ్లను మాత్రమే ఉపయోగించాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు సూచించారు. ఎవరైనా రహదారులపై గుంతలు తవ్వితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
శనివారం ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. లక్షలాది రూపాయలతో నిర్మించిన రహదారులపై శుభకార్యాలు, ఇతర కార్యక్రమాల కోసం షామియానాలు ఏర్పాటు చేసేందుకు గుంతలు తవ్వడం, మేకులు కొట్టడం వల్ల రహదారులు దెబ్బతింటున్నాయని తెలిపారు. ఒకసారి రహదారిని తవ్వడం వల్ల ఏర్పడే ప్యాచ్‌ల కారణంగా రోడ్డు నాణ్యత దెబ్బతినడంతో పాటు ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని పేర్కొన్నారు.
అందువల్ల రహదారులపై గుంతలు తవ్వడం, మేకులు కొట్టడం వంటి చర్యలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా కాంక్రీట్ స్టాండ్లు లేదా రహదారికి నష్టం కలగని ఇతర పద్ధతులను ఉపయోగించి షామియానాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్స్ చట్టం, 1994లోని సెక్షన్ 197తో భారీ జరిమానాలు విధిస్తామని కమిషనర్ హెచ్చరించారు. రహదారికి జరిగిన నష్టానికి నిబంధనల ప్రకారం సంబంధిత ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలతో పాటు కార్యక్రమ నిర్వాహకులు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు.
కార్యక్రమాల నిర్వహణ సమయంలో రహదారులకు నష్టం కలగకుండా నిబంధనలు పాటించాలని, క్షేత్రస్థాయిలో మున్సిపల్ యంత్రాంగం నిత్యం తనిఖీలు నిర్వహిస్తుందని కమిషనర్ స్పష్టం చేశారు.




