Devanakonda: దేవనకొండ జడ్పీటీసీ బరిలో డాక్టర్ షేక్ సాధిక హోరు!
Devanakonda: దేవనకొండ జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థి డాక్టర్ షేక్ సాధిక విస్తృత ప్రచారం. ఐదు గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ ‘సూపర్ సిక్స్’ పథకాలను వివరిస్తూ సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థన.
Devanakonda: దేవనకొండ జడ్పీటీసీ బరిలో డాక్టర్ షేక్ సాధిక హోరు!
Devanakonda: దేవనకొండ జడ్పీటీసీ ఎన్నికల బరిలో టీడీపీ అభ్యర్థిగా నిలిచిన డాక్టర్ షేక్ సాధిక ప్రచారంలో దూసుకుపోతున్నారు. గ్రామగ్రామాన పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతూ తన ప్రచారాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు.
ఇందులో భాగంగా నేడు గుడమిరాళ్ల, బంటుపల్లి, చెల్లెలుచెలిమల, బేతపల్లి, బండపల్లి గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించి ఓటర్లను కలుసుకున్నారు.
దేవనకొండ మండల అధ్యక్షుడు ఈడిగ లక్ష్మీ, ఎంపీపీ అభ్యర్థి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో సాగిన ఈ ప్రచారంలో డాక్టర్ సాధికకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ, కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు.
గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి మహిళలు, వృద్ధులు, యువతతో ఆత్మీయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా డాక్టర్ షేక్ సాధిక మాట్లాడుతూ.. వైద్యురాలిగా ప్రజలకు సేవలు అందించిన తనకు, ఇప్పుడు రాజకీయాల ద్వారా మరింత విస్తృతంగా ప్రజలకు సేవ చేసే అవకాశం లభించిందన్నారు.
ప్రజల ఆదరాభిమానాలతో జడ్పీటీసీగా గెలిస్తే ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.మహిళలకు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పిస్తూ ఎన్డీఏ కూటమి మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
మహిళలు వంటింటికే పరిమితం కాకుండా విద్య, వైద్యం, రాజకీయాలు, వ్యాపారం ఇలా అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గాలు చూపడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.తన మామగారైన ఈదుల దేవరబండ సుభాన్ టీడీపీలో ఉంటూ నిరంతరం ప్రజాసేవకు కృషి చేస్తున్నారని, ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ, కష్టాల్లో ఉన్న కుటుంబాలకు తనవంతు సహాయం అందిస్తున్నారని తెలిపారు.
ఆయన ప్రజాసేవా స్ఫూర్తి తనకు ఎంతో ప్రేరణనిచ్చిందని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నానని వెల్లడించారు.దేవనకొండ మండల ప్రజలు తనను తమ ఇంటి ఆడబిడ్డగా ఆదరించి ఆశీర్వదించాలని కోరారు.
రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు తనపై ఉంచే నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పదవిని అధికారంగా కాకుండా బాధ్యతగా భావించి నిరంతరం ప్రజాసేవకు అంకితమవుతానని డాక్టర్ షేక్ సాధిక హామీ ఇచ్చారు.
ఈ ప్రచార కార్యక్రమంలో రాజగోపాల్ గౌడ్, ఈదుల దేవరబండ సుభాన్, బండి గింజల రంగన్న, ఆకుల వీరేష్, మస్తాన్ తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు.




