Kurnool: స్వచ్ఛత హీ సేవలో అందరూ భాగస్వామ్యం కావాలి: కలెక్టర్ సిరి
Kurnool: కర్నూలులో 'స్వచ్ఛత హీ సేవ–2026'ను కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు.
Kurnool: స్వచ్ఛత హీ సేవలో అందరూ భాగస్వామ్యం కావాలి: కలెక్టర్ సిరి
కర్నూలు: స్వచ్ఛత హీ సేవలో జిల్లా ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్, నగరపాలక ప్రత్యేక అధికారిణి డాక్టర్ ఏ.సిరి ఐఏఎస్ పిలుపునిచ్చారు. గురువారం ఆమె క్యాంపు కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసుతో కలిసి స్వచ్ఛత హీ సేవ–2026 కార్యక్రమాన్ని దీపాలతో లాంఛనంగా ప్రారంభించారు.
కలెక్టర్ మాట్లాడుతూ.. స్వచ్ఛత హీ సేవ–2026 కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రతి ఇంటి నుంచి స్వచ్ఛత ఉద్యమాన్ని ప్రారంభించామని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా పౌరులు తమ ఇళ్లను శుభ్రం చేసుకుని, ఒక దీపాన్ని వెలిగించి స్వచ్ఛమైన జీవన విధానాన్ని పాటిస్తామని సంకల్పం చేయాలని సూచించారు.
ఇంటిని శుభ్రంగా ఉంచడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, చెత్తను బాధ్యతగా నిర్వహించడం, స్వచ్ఛత కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం ద్వారా స్వచ్ఛతను ప్రతి ఒక్కరి నిత్య జీవన విధానంగా మార్చుకోవాలని కోరారు.
ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛత కార్యక్రమాలు మరింత విజయవంతం అవుతాయని, ప్రతి ఇంటి నుంచి ప్రారంభమయ్యే స్వచ్ఛత సంకల్పం పరిశుభ్రమైన నగరం, పరిశుభ్రమైన రాష్ట్రం, పరిశుభ్రమైన దేశ నిర్మాణానికి దోహదపడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డిఆర్వో వెంకట నారాయణమ్మ, ఆర్డీవో సందీప్, ఎంహెచ్‌ఓ డాక్టర్ ఎం.రఘు, తదితరులు పాల్గొన్నారు.




