Kurnool: నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్డీపీఓ రాఘవేంద్ర!
Kurnool: కర్నూలు జిల్లా సి. బెలగల్, సంగాల, బురానుదొడ్డి నామినేషన్ కేంద్రాలను ఎస్డీపీఓ రాఘవేంద్ర తనిఖీ చేసి, ఎన్నికల నియమావళిని పాటించాలని సూచించారు.
Kurnool: నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్డీపీఓ రాఘవేంద్ర!
కర్నూలు జిల్లా: కర్నూలు జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా జరిగేలా పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ఇందులో భాగంగా ఎస్డీపీఓ రాఘవేంద్ర సి. బెలగల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ వేణుగోపాల రాజు, పోలీసు సిబ్బందితో కలిసి సి. బెలగల్, సంగాల, బురానుదొడ్డి గ్రామాల్లో ఏర్పాటు చేసిన సర్పంచ్ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను సందర్శించి క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా నామినేషన్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లు, పోలీస్ బందోబస్తు, బారికేడింగ్, అభ్యర్థులు, ప్రజల రాకపోకలు, క్యూలైన్ల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు సిబ్బందికి సూచించారు.
నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులు, వారి మద్దతుదారులు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని ఎస్డీపీఓ సూచించారు. అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించడం, గుంపులుగా చేరడం, నినాదాలు చేయడం, ఇతరులకు ఇబ్బందులు కలిగించే చర్యలకు పాల్పడరాదని స్పష్టం చేశారు.
అదేవిధంగా నామినేషన్ కేంద్రాల వద్ద రాజకీయ విభేదాలు, వాగ్వాదాలు, ఘర్షణలకు అవకాశం లేకుండా పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచడంతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.
స్థానిక సంస్థల ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా, స్వేచ్ఛాయుతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖ అన్ని విధాలా సిద్ధంగా ఉందని ఎస్డీపీఓ రాఘవేంద్ర తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు, అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.




