Kurnool: రూ.లక్ష కోట్లతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్: సీఎం చంద్రబాబు

Kurnool: రాయలసీమ, ఒంగోలు, మార్కాపురం జిల్లాలను రూ.లక్ష కోట్లతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దే ప్రాజెక్టును మదనపల్లెలో ప్రారంభించనున్నారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 29 Sept 2026 3:06 PM IST
Kurnool
X

Kurnool: రూ.లక్ష కోట్లతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్: సీఎం చంద్రబాబు

కర్నూలు: రాయలసీమ జిల్లాలు, ఒంగోలు,మార్కాపురం జిల్లాలను దేశంలోనే ప్రముఖ “గ్లోబల్ హార్టికల్చర్ హబ్”గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ఉద్యాన అభివృద్ధి ప్రణాళిక అమలుకు నడుం బిగించింది. అక్టోబర్ రెండవ తేదీన అన్నమయ్య జిల్లా మదనపల్లి లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లక్ష కోట్లతో ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు శ్రీకారం చుట్టనున్నారు.

ఉద్యాన పంటల విస్తీర్ణం పెంపు, సాగునీటి లభ్యత, గ్రామీణ రహదారుల అభివృద్ధి, పంటల ఉత్పాదకత పెంపు, కోత అనంతర నష్టాల నివారణ, ప్రాసెసింగ్, విలువ జోడింపు, మార్కెటింగ్, ఎగుమతులకు అనుసంధానం వంటి అన్ని అంశాలను సమగ్రంగా అభివృద్ధి చేయడం ద్వారా రైతులకు మెరుగైన ఆదాయ అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.

ఈ కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లాలో రూ.4,191 కోట్లతో ఉద్యాన రంగం అభివృధ్ధి,

సాగునీరు, గ్రామీణ రహదారులు, తదితర రంగాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

నీటిపారుదల రంగం అభివృద్ధి

గ్లోబల్ హార్టికల్చర్ హబ్ లో భాగంగా జిల్లాలో నీటిపారుదల రంగం అభివృద్ధికి రూ. 2019 కోట్లను కేటాయించారు. ఇందులో భాగంగా వేదవతి లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేయడం ద్వారా వెనుకబడిన ఆలూరు, ఆస్పరి, దేవనకొండ, హోళగుంద, చిప్పగిరి మండలాలలోని 80 వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించడం వల్ల ఉద్యాన రంగ అభివృద్ధికి కృషి జరగనుంది.

అదేవిధంగా గాజులదిన్నె ప్రాజెక్టు నీటి సామర్థ్యాన్ని ప్రస్తుత 4.50 టీఎంసీల నుంచి 5.50 టీఎంసీలకు పెంచే చర్యలు చేపడుతున్నారు. అలాగే 110 నీటిపారుదల చెరువుల అభివృద్ధి, బలోపేతంపై కూడా దృష్టి పెట్టడం వల్ల సాగునీటి వసతులు మెరుగుపడి ఉద్యాన పంటల సాగును మరింత విస్తరించేందుకు రైతులకు అనుకూల పరిస్థితులు ఏర్పడనున్నాయి.

గ్రామీణ ప్రాంతాల నుంచి మార్కెట్‌కు మెరుగైన రహదారి సదుపాయం

రైతులు పండించిన పంటలను సమయానికి మార్కెట్‌కు తరలించేందుకు మెరుగైన రహదారి సదుపాయాలు ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాలో 721 కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారుల నిర్మాణం మరియు కనెక్టివిటీని అభివృద్ధి చేయనున్నారు.

ఇందులో 442 కిలోమీటర్ల రహదారుల పునర్నిర్మాణం, మరో 279 కిలోమీటర్ల మేర రహదారి అభివృద్ధి పనులు చేపట్టేందుకు సుమారు రూ.530 కోట్లు ఖర్చు చేయనున్నారు.

ఈ రహదారుల అభివృద్ధి పూర్తయితే గ్రామీణ ప్రాంతాల నుంచి రైతులు పండించిన మామిడి, బత్తాయి, ఉల్లి, మిరప, బొప్పాయి, కూరగాయలు, పూలు తదితర పంటలను సమీప మార్కెట్లు, కలెక్షన్ సెంటర్లు, ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజీలు, మార్కెట్ యార్డులకు వేగంగా తరలించేందుకు అవకాశం ఉంటుంది. రవాణా సమయం, రవాణా వ్యయం తగ్గడంతో పాటు పంటల నాణ్యతను కాపాడేందుకు ఇది దోహదపడుతుంది.

60 వేల హెక్టార్లలో ఉద్యాన సాగు విస్తరణ

కర్నూలు జిల్లాలో ప్రస్తుతం 86,343 హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగు అవుతున్నాయి. ఏటా సుమారు 19.32 లక్షల మెట్రిక్ టన్నుల ఉద్యాన ఉత్పత్తి నమోదవుతోంది. ఉద్యాన రంగం ద్వారా ప్రస్తుతం సుమారు రూ.6,768 కోట్ల GVA లభిస్తోంది. “గ్లోబల్ హార్టికల్చర్ హబ్ – రాయలసీమ రైజింగ్” కార్యక్రమంలో భాగంగా రూ.1642 కోట్లతో అదనంగా మరో 60,000 హెక్టార్లలో ఉద్యాన పంటల విస్తరణ చేపట్టడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ కార్యక్రమాన్ని మూడు దశల్లో అమలు చేయనున్నారు. ప్రధానంగా మామిడి, బత్తాయి, ఉల్లి, మిరప, బొప్పాయి, కూరగాయలు, పూలు వంటి పంటల సాగును విస్తరించడంతో పాటు ప్రాంతానికి అనుకూలమైన, వాతావరణ మార్పులను తట్టుకునే ఉద్యాన పంటలను ప్రోత్సహించనున్నారు.

రాయలసీమను ప్రపంచ ఉద్యాన కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యం

సాగునీరు, రహదారులు, ఉద్యాన సాగు, ఆధునిక సాంకేతికత, యాంత్రీకరణ, పంటల నిల్వ, ప్రాసెసింగ్, విలువ జోడింపు, మార్కెటింగ్, ఎగుమతులు వంటి అన్ని అంశాలను ఒకే సమగ్ర వ్యవస్థలోకి తీసుకువచ్చి రాయలసీమను ఉద్యాన రంగంలో కీలక కేంద్రంగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

తద్వారా రైతులకు అదనపు ఆదాయ అవకాశాలు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. రూ.లక్ష కోట్లతో రాయలసీమ జిల్లాలు, ఒంగోలు, మార్కాపురం జిల్లాలు మొత్తం 10 జిల్లాలను “గ్లోబల్ హార్టికల్చర్ హబ్”గా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL