Kurnool: గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా రాయలసీమ: ఉద్యాన అధికారులు

Kurnool: రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆలూరు మండలం హులేబీడులో వ్యవసాయ, ఉద్యాన అధికారులు క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించారు.

Bheemalinga, Aluru
Published on: 29 Sept 2026 5:36 PM IST
Kurnool
X

Kurnool: గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా రాయలసీమ: ఉద్యాన అధికారులు

కర్నూలు జిల్లా: ఆలూరు రాయలసీమ ప్రాంతాన్ని గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సమగ్ర ఉద్యాన అభివృద్ధి ప్రణాళిక (IHDP) అమలు చేస్తున్నట్లు ఉద్యానశాఖ అధికారులు తెలిపారు.

ఆలూరు, చిప్పగిరి మండలాల్లో సుమారు రూ.30 కోట్ల విలువైన ఉద్యాన అభివృద్ధి పనులు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం ఆలూరు మండలం హులేబీడు గ్రామంలో రైతులు వీరేష్, ఈడిగ వెంకటేష్ సాగు చేస్తున్న తీగజాతి బీరకాయ పంటలను ఏడీఏ చంగల్ రాయుడు, ఏవో వెంకటేష్ గౌడ్, ఉద్యానశాఖ అధికారి ఇందిర, సూక్ష్మ నీటిపారుదల సిగ్నటిక్ జిల్లా కోఆర్డినేటర్ శాంతన్న పరిశీలించారు.

ఆధునిక సాగు పద్ధతులను అవలంబించి అధిక దిగుబడులు సాధించాలని రైతులకు సూచించారు. IHDPలో సూక్ష్మ నీటిపారుదల, ఫెర్టిగేషన్, ఫార్మ్ పాండ్లు, పాత తోటల పునరుద్ధరణ, నాణ్యమైన మొక్కలు, యాంత్రీకరణకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు.

అలాగే కలెక్షన్ సెంటర్లు, ప్యాక్‌హౌస్‌లు, కోల్డ్‌చైన్‌, నిల్వ, ప్రాసెసింగ్‌ సదుపాయాలను అభివృద్ధి చేసి రైతులకు మెరుగైన మార్కెట్, ఎగుమతి అవకాశాలు కల్పించనున్నట్లు వివరించారు. మామిడి, బత్తాయి, ఉల్లి, మిరప, బొప్పాయి, కూరగాయలు, పూల సాగును ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉద్యానశాఖ సిబ్బంది రవి, అన్నప్ప, రేవన్నతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.

Bheemalinga, Aluru

Bheemalinga, Aluru