Kurnool: దేవరగట్టు బన్నీ ఉత్సవం..అరికేరలో పోలీసుల తనిఖీలు - కర్రలు స్వాధీనం!
Kurnool: కర్నూలు జిల్లా దేవరగట్టు బన్నీ ఉత్సవాల నేపథ్యంలో ముందస్తు తనిఖీలు చేపట్టిన పోలీసులు. భారీగా రింగుల కర్రలు, గండ్రగొడ్డలి స్వాధీనం.
Kurnool: దేవరగట్టు బన్నీ ఉత్సవం..అరికేరలో పోలీసుల తనిఖీలు - కర్రలు స్వాధీనం!
Kurnool: కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికేర గ్రామంలో పత్తికొండ డీఎస్పీ వెంకటరమయ్య ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా ముందస్తు తనిఖీలు నిర్వహించారు.
విజయదశమి సందర్భంగా దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి బన్నీ ఉత్సవం నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఉత్సవంలో పాల్గొనే దాదాపు 18 గ్రామాల్లో సుమారు 100 మంది పోలీసులతో ముందస్తు తనిఖీలు చేపట్టారు.
గ్రామాల్లో తనిఖీల్లో భాగంగా భారీగా 83 రింగులు తొడిగిన కర్రలతో పాటు ఒక గండ్రగొడ్డలిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం డీఎస్పీ వెంకటరమయ్య మీడియాతో మాట్లాడుతూ దసరా బన్నీ ఉత్సవాల పేరుతో ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరి ఇళ్లలోనైనా రింగులు తొడిగిన కర్రలు, గొడ్డళ్లు లభిస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
గతంలో బన్నీ ఉత్సవంలో ఘర్షణలకు దిగిన వారిపై రేపటి నుంచి బైండోవర్ కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. ఉత్సవం సందర్భంగా అల్లర్లు సృష్టించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని వెల్లడించారు.
మాల మల్లేశ్వర స్వామి భక్తులు ప్రశాంత వాతావరణంలో ఉత్సవాన్ని జరుపుకోవాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.




