Nandyal: రొమ్ము క్యాన్సర్ అవగాహన పింక్ వాకథాన్..హాజరైన కలెక్టర్, ఎంపీ!

Nandyal: నంద్యాలలో మహిళల కోసం రొమ్ము క్యాన్సర్ అవగాహన పింక్ వాకథాన్. పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, వైద్యులు.

R Pavankalyan, Nandyal
Published on: 3 Oct 2026 12:45 PM IST
Nandyal
X

Nandyal: రొమ్ము క్యాన్సర్ అవగాహన పింక్ వాకథాన్..హాజరైన కలెక్టర్, ఎంపీ!

Nandyal: రొమ్ము క్యాన్సర్‌పై మహిళల్లో అవగాహన పెంచేందుకు నంద్యాలలో పింక్ వాకథాన్ నిర్వహించారు. నంద్యాల మహిళా వైద్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, వైద్యులు, విద్యార్థులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అక్టోబర్‌ను రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించడంతో పాటు, వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించేలా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ పింక్ వాకథాన్ చేపట్టారు.

ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ కుటుంబం, ఉద్యోగం, పిల్లల బాధ్యతల్లో నిమగ్నమై మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదన్నారు. ప్రతి మహిళ తన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.

రొమ్ములో గడ్డలు, చర్మంలో మార్పులు, అసాధారణమైన నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.

ప్రతి మహిళ క్రమం తప్పకుండా బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలని అనుమానాస్పద లక్షణాలు ఉంటే వైద్యుల సలహాతో మ్యామోగ్రఫీ, సోనో మ్యామోగ్రఫీ వంటి పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు.

అన్ని గడ్డలు క్యాన్సర్‌కు సంబంధించినవి కావని అయితే అనుమానం వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం ద్వారా వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

నంద్యాల మహిళా వైద్యులు ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్, వైద్య సలహాలపై అవగాహన కల్పించారు. మహిళలు ఎలాంటి మొహమాటం లేకుండా ముందుకు వచ్చి తమ ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలని వైద్యులు సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి పాల్గొని మహిళలకు అవగాహన కల్పించారు. వైద్యులు, విద్యార్థులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పింక్ వాకథాన్‌ను విజయవంతం చేశారు.

సకాలంలో గుర్తింపు సరైన వైద్యం ప్రాణాలను కాపాడుతుంది. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంచుతూ ప్రతి మహిళ తన ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని పింక్ వాకథాన్ ద్వారా సందేశాన్ని అందించారు.

R Pavankalyan, Nandyal

R Pavankalyan, Nandyal