Nandyal: కొత్త ముచ్చుమర్రి సర్పంచిగా తలారి ఓబులేసు ఏకగ్రీవం

Nandyal: నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం కొత్త ముచ్చుమర్రి సర్పంచ్‌గా టీడీపీ మద్దతుతో తలారి ఓబులేసు ఏకగ్రీవ ఎన్నిక; ఎంపీ బైరెడ్డి శబరి హర్షం, సంబరాలు.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)
Published on: 24 Nov 2026 6:03 PM IST
Nandyal
X

Nandyal: కొత్త ముచ్చుమర్రి సర్పంచిగా తలారి ఓబులేసు ఏకగ్రీవం

నంద్యాల: నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం, పగిడ్యాల మండలం పంచాయతీ ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీకి తొలి విజయం దక్కింది. పగిడ్యాల మండలంలోని కొత్త ముచ్చుమర్రి గ్రామ సర్పంచ్ గా టీడీపీ బలపరిచిన అభ్యర్థి తలారి ఓబులేసు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

గ్రామంలో సర్పంచ్ పదవికి పోటీ వాతావరణం నెలకొన్నప్పటికీ, చివరి నిమిషంలో అన్ని వర్గాల పెద్దలు ఏకమై ఓబులేసును ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని నిర్ణయించారు.

కొత్త ముచ్చుమర్రి గ్రామం నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి సొంత మండలం కావడంతో ఈ ఏకగ్రీవంపై ఆమె ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామంలోని అన్ని వర్గాల నాయకులతో మాట్లాడి, గ్రామ అభివృద్ధికి ఏకగ్రీవం ఎంతో అవసరమని నచ్చజెప్పారు. ఎంపీ బైరెడ్డి శబరి బలపరిచిన అభ్యర్థిగా తలారి ఓబులేసు బరిలో నిలవడంతో, టీడీపీ శ్రేణులు పూర్తిగా ఆయనకు అండగా నిలిచాయి.

ఈ ఏకగ్రీవం పట్ల ఎంపీ బైరెడ్డి శబరి హర్షం వ్యక్తం చేశారు. కొత్త ముచ్చుమర్రి గ్రామస్తులకు, టీడీపీ నాయకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తలారి ఓబులేసు ఏకగ్రీవం కావడంతో గ్రామంలో టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు. గ్రామ పెద్దలు ఓబులేసును శాలువాతో సత్కరించి అభినందించారు.

ఈ సందర్భంగా నూతన సర్పంచ్ తలారి ఓబులేసు మాట్లాడుతూ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న కొత్త ముచ్చుమర్రి గ్రామ ప్రజలకు, పెద్దలకు జీవితాంతం రుణపడి ఉంటాను. నాపై నమ్మకం ఉంచిన ఎంపీ బైరెడ్డి శబరి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. కుల, మత, పార్టీలకు అతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను. ముఖ్యంగా తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సమస్యలను ప్రభుత్వ సహకారంతో పరిష్కరిస్తాను" అని హామీ ఇచ్చారు.

మండలంలోనే మొదటి ఏకగ్రీవంగా కొత్త ముచ్చుమర్రి నిలవడంతో పగిడ్యాల మండల టీడీపీలో ఉత్సాహం నెలకొంది. ఈ విజయం రాబోయే పంచాయతీ ఎన్నికలకు శుభసూచకమని టీడీపీ నాయకులు చెబుతున్నారు.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)

Iman Raju, Nandikotkur(Kurnool Dist)