Nandyal: సైబర్ నేరగాళ్ల అరెస్టు - రూ.25 లక్షల నగదు స్వాధీనం
Nandyal: నంద్యాలలో సైబర్ నేరగాళ్ల అరెస్టు. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు, ఏపీకే ఫైల్స్ పేరిట మోసాలకు పాల్పడిన ఇద్దరి నిందితుల నుంచి రూ.25 లక్షలు స్వాధీనం.
Nandyal: సైబర్ నేరగాళ్ల అరెస్టు - రూ.25 లక్షల నగదు స్వాధీనం
నంద్యాల: నంద్యాల జిల్లాలో సైబర్ నేరగాళ్ల మోసాలకు పోలీసులు చెక్ పెట్టారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం పెంచుకుని స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో ఓ వ్యక్తి నుంచి ఏకంగా 22 లక్షల 80 వేల రూపాయలు కాజేసిన సైబర్ ముఠా మోసం వెలుగులోకి వచ్చింది.
మరో కేసులో APK ఫైల్ ఓపెన్ చేయించి బ్యాంకు ఖాతా నుంచి నగదు మాయం చేసిన ఘటనపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ రెండు కేసుల్లో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, 25 లక్షల రూపాయల నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు.
సైబర్ నేరాలపై నంద్యాల జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలో నమోదైన రెండు సైబర్ మోసం కేసుల్లో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
ఇన్స్టాగ్రామ్ ద్వారా బాధితుడిని పరిచయం చేసుకున్న సైబర్ నేరగాళ్లు.. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించారు. అనంతరం నకిలీ యాప్, లెక్కల ద్వారా బాధితుడికి కోటి 44 లక్షల రూపాయలకు పైగా లాభం వచ్చినట్లు చూపించారు.
ఆ లాభాలను తీసుకోవాలంటే ట్యాక్స్, ఇతర ఛార్జీల పేరుతో మరో 25 లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో అనుమానం వచ్చిన బాధితుడు మోసపోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను గుర్తించి అరెస్టు చేశారు.
మరో కేసులో APK ఫైల్‌ను ఓపెన్ చేయించిన సైబర్ నేరగాళ్లు.. మరో వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి నగదును మాయం చేసినట్లు పోలీసులు గుర్తించారు. సైబర్ మోసాలకు బ్యాంకు ఖాతాలను వినియోగిస్తున్న నిందితులపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ రెండు కేసుల్లో కొలుసు శ్రీకాంత్, సనపాల సాయి ప్రకాష్ నాయుడులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 25 లక్షల రూపాయల నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు.
సైబర్ నేరాల నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ తెలిపారు. నిందితుల ముఠాతో మరింత మందికి సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
అవగాహన సైబర్ నేరాల విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. సోషల్ మీడియాలో పరిచయం లేని వ్యక్తులు పంపే పెట్టుబడి ఆఫర్లు, భారీ లాభాల హామీలను నమ్మకండి. గుర్తుతెలియని APK ఫైళ్లు, అనుమానాస్పద లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దు.
OTP, ATM PIN, CVV, బ్యాంకు ఖాతా వివరాలు, పాస్‌వర్డ్‌లను అపరిచితులతో పంచుకోవద్దు. పెట్టుబడుల పేరుతో ఎవరైనా అత్యవసరంగా డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేస్తే ముందుగా సంబంధిత సంస్థ అధికారిక వివరాలను పరిశీలించండి.
సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయండి. వీలైనంత త్వరగా ఫిర్యాదు చేస్తే మోసపోయిన నగదును ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుంది.సైబర్ మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండండి.. మీ డబ్బు, మీ వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితంగా కాపాడుకోండి.




