Nandyal: సుండిపెంట పంచాయతీ ఎన్నిక ఏకగ్రీవానికి కృషి చేయాలి

Nandyal: నంద్యాల జిల్లా సుండిపెంట అభివృద్ధికి అన్ని పార్టీలు ఏకగ్రీవానికి కృషి చేయాలని సీపీఐ పిలుపు. స్వామి రెడ్డి భవనంలో మండల కార్యదర్శి పులి రాజు భేటీ.

P NAGESWARA RAO, SRISAILAM
Published on: 8 Nov 2026 7:51 PM IST
Nandyal
X

Nandyal: సుండిపెంట పంచాయతీ ఎన్నిక ఏకగ్రీవానికి కృషి చేయాలి

నంద్యాల జిల్లా: శ్రీశైలం మండలం సుండిపెంట గ్రామ అభివృద్ధే లక్ష్యంగా అన్ని పార్టీలు ఏకగ్రీవానికి కృషి చేయాలి సీపీఐ పిలుపు రాజకీయాలకు అతీతంగా సుండిపెంట గ్రామ అభివృద్ధికి అన్ని పార్టీలు ఐక్యంగా ముందుకు రావాలి. స్థానిక సుండిపెంట స్వామి రెడ్డి భవనంలో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) మండల కార్యదర్శి పి. పులి రాజు ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలు, గ్రామ అభివృద్ధి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు.

ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి పి. పులి రాజు, సహాయ కార్యదర్శి బి. బాల నరసింహులు, టీ. మల్లికార్జున, ఏఐటీయూసీ సీనియర్ నాయకులు డి. ఓబులయ్య మాట్లాడుతూ, సుండిపెంట గ్రామ పంచాయతీ ఎన్నికలను రాజకీయాలకు అతీతంగా గ్రామ అభివృద్ధి లక్ష్యంగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్, సీపీఎం తదితర అన్ని రాజకీయ పార్టీల నాయకులు పరస్పర అవగాహనతో ఒకే వేదికపైకి వచ్చి గ్రామ భవిష్యత్తు అభివృద్ధిపై చర్చించాలని కోరారు.

సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకునే దిశగా అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని, ఎన్నికల సమయంలో రాజకీయ పోటీలు, వ్యక్తిగత విభేదాల కంటే గ్రామ ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఏకగ్రీవ ఎన్నికల ద్వారా ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులను సమర్థవంతంగా వినియోగించుకొని గ్రామంలో అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

ముఖ్యంగా ఎన్నో సంవత్సరాలుగా సుండిపెంట గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలని నాయకులు అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా కృషి చేసి, ఏకగ్రీవ ఎన్నికల ద్వారా ప్రభుత్వ సహకారంతో ఈ సమస్యకు త్వరితగతిన శాశ్వత పరిష్కారం లభించేలా చూడవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రతి ఇంటికీ నిరంతరంగా స్వచ్ఛమైన మంచినీరు అందించే విధంగా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

అన్ని రాజకీయ పార్టీలు పరస్పర అవగాహనతో ఏకగ్రీవ ఎన్నికలకు సహకరించడం ద్వారా సుండిపెంట గ్రామానికి రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు, గౌరవం లభించడంతో పాటు, గ్రామ అభివృద్ధికి ఒక ఆదర్శవంతమైన మార్గం ఏర్పడుతుందని నాయకులు అభిప్రాయపడ్డారు. రాజకీయాలకు అతీతంగా గ్రామ ప్రజలంతా ఐక్యంగా ఉంటే సుండిపెంటను మరింత అభివృద్ధి పథంలో నడిపించవచ్చని పేర్కొన్నారు.

గ్రామంలో అన్ని రహదారులు, పారిశుద్ధ్యం, తాగునీరు తదితర మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాల కోసం అన్ని పార్టీలు సమష్టిగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సుండిపెంట గ్రామంలో రాజకీయ ఐక్యతకు, అభివృద్ధికి కొత్త సంప్రదాయం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

ఈ సమావేశంలో సీపీఐ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు అన్వర్ భాష, మతేష్, పాపులమ్మ, లక్ష్మయ్య, రమేష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

P NAGESWARA RAO, SRISAILAM

P NAGESWARA RAO, SRISAILAM