Nandyal: రాయలసీమకు దక్కాల్సిన సంస్థలను తరలించడం దారుణం.. బొజ్జ!

Nandyal: రాయలసీమకు దక్కాల్సిన సంస్థలు, కార్యాలయాలను తరలించడంపై సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథ రామిరెడ్డి నంద్యాలలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Hari Kishan  AP Bureau Chief
Updated on: 14 Nov 2026 9:45 AM IST
Nandyal
X

Nandyal: రాయలసీమకు దక్కాల్సిన సంస్థలను తరలించడం దారుణం.. బొజ్జ!

Nandyal: రాయలసీమకు దక్కాల్సిన పరిపాలనా ప్రాధాన్యత, ప్రభుత్వ కార్యాలయాలు, జాతీయ స్థాయి సంస్థల విషయంలో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథ రామిరెడ్డి విమర్శించారు. ఇప్పటికే సీమకు దక్కాల్సిన సంస్థలు రాకపోగా, ఉన్న సంస్థలను సైతం ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇన్ని పరిణామాలు చోటుచేసుకుంటున్నా రాయలసీమ రాజకీయ నాయకులు మౌనం వీడకపోవడం ఏమిటని ప్రశ్నించారు. వ్యక్తిగత విమర్శలు, ఆధిపత్య పోరాటాలతో రాజకీయ మైలేజీ కోసం ప్రయత్నించడం మానుకొని ప్రాంత ప్రయోజనాల కోసం పోరాడాలని హితవు పలికారు. శుక్రవారం నంద్యాలలోని సమితి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

కర్నూలులోని కార్యాలయానికీ దిక్కులేదా?

కర్నూలులో ఏర్పాటు చేసిన మానవ హక్కుల కమిషన్ కార్యాలయం కార్యకలాపాలను వారానికో ప్రాంతంలో నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని దశరథ రామిరెడ్డి తప్పుబట్టారు. విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం ప్రాంతాల ప్రజలకు కర్నూలు దూరమవుతుందనే కారణంతో ఈ నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదన్నారు.

ఇదే సూత్రం రాయలసీమకు ఎందుకు వర్తించదని ప్రశ్నించారు. హైకోర్టు, సచివాలయం, శాసనసభతో పాటు కీలక ప్రభుత్వ కార్యాలయాలన్నీ సీమ ప్రజలకు దూరంగా ఉన్న విషయాన్ని పాలకులు గుర్తించాలని సూచించారు.

శాసనసభ సమావేశాలను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో నిర్వహించాలని, బడ్జెట్ సమావేశాలను రాయలసీమలో జరపాలని డిమాండ్ చేశారు. సచివాలయ శాఖల కార్యాలయాలను రొటేషన్ పద్ధతిలో కర్నూలులో నిర్వహించాలని, అనుబంధ కార్యాలయాలను సీమలో ఏర్పాటు చేయాలని కోరారు.

ప్రకటించిన హైకోర్టును ఆలస్యం చేయకుండా కర్నూలులో ఏర్పాటు చేయాలని, రాజధాని ప్రాంతాన్ని ఫ్రీజోన్‌గా ప్రకటించి ప్రభుత్వ ఉద్యోగాల్లో సీమ యువతకు సమాన అవకాశాలు కల్పించాలని పేర్కొన్నారు.

సీమకు దక్కాల్సిన సంస్థలేవీ?

రాయలసీమకు రావాల్సిన పలు కీలక సంస్థలు, ప్రాజెక్టుల విషయంలో జరిగిన పరిణామాలను ఆయన ప్రస్తావించారు. అనంతపురంలో ఏర్పాటు కావాల్సిన ఎయిమ్స్ ప్రతిపాదన పక్కనపెట్టి మంగళగిరిలో సంస్థను ఏర్పాటు చేశారని విమర్శించారు.

కడప స్టీల్ ప్లాంట్ విషయంలో ఏళ్ల తరబడి హామీలకే పరిమితమయ్యారని అన్నారు. కర్నూలులో ఏర్పాటు కావాల్సిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని విజయవాడకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కడపలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలించడం, కర్నూలులో శంకుస్థాపన చేసిన న్యాయ విశ్వవిద్యాలయాన్ని అమరావతికి మార్చడం వంటి అంశాలను ప్రస్తావించారు.

విభజన చట్టం ప్రకారం రాయలసీమకు రావాల్సిన జాతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ కోసం కేంద్రం కేటాయించిన రూ.135 కోట్లను గుంటూరు జిల్లా లాంలోని ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ భవన నిర్మాణానికి మళ్లించారని ఆరోపించారు. ఈ నిర్ణయాల వెనుక కారణాలను ప్రభుత్వం ప్రజలకు వివరించాలని, సీమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని డిమాండ్ చేశారు.

వనరులు కావాలి.. అభివృద్ధి మాత్రం వద్దా?

రాయలసీమను కేవలం ఇతర ప్రాంతాల అభివృద్ధికి ముడిసరుకు అందించే ప్రాంతంగా చూస్తున్నారా అని దశరథ రామిరెడ్డి ప్రశ్నించారు. నీరు, ఎర్రచందనం, సౌర, పవన విద్యుత్ వనరులు, ఖనిజ సంపద కావాలంటున్న పాలకులు.. వాటిని అందిస్తున్న ప్రాంతానికి ప్రభుత్వ కార్యాలయాలు, పరిశ్రమలు, పెట్టుబడులు, సాగునీటి ప్రాజెక్టులు, ఉపాధి అవకాశాలు ఎందుకు కల్పించడం లేదని నిలదీశారు.

ప్రత్యేక హక్కులు కోరడం లేదని, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కల్పిస్తున్న అవకాశాలు, సౌకర్యాలనే రాయలసీమకు కూడా కల్పించాలని స్పష్టం చేశారు.

సీమ నాయకులకు సూటి ప్రశ్న..

రాయలసీమ సమాజాన్ని జీరో చేసి నాయకులు హీరోలు కావాలనుకుంటున్నారా అంటూ రాజకీయ నేతలను ప్రశ్నించారు. ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై మాట్లాడకుండా ప్రత్యర్థులపై వ్యక్తిగత దూషణలకు దిగడం వల్ల సీమ భవిష్యత్తుకు ప్రయోజనం ఏమిటని నిలదీశారు.

కార్యాలయాలు తరలిపోతున్నా, జాతీయ సంస్థలు దక్కకపోయినా, సాగునీటి ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నా, పరిశ్రమలు రాకపోయినా నాయకులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

అన్ని రాజకీయ పార్టీల నాయకులు వ్యక్తిగత విమర్శలు, ఆధిపత్య పోరాటాలను పక్కనపెట్టి రాయలసీమ అభివృద్ధి కోసం ఉమ్మడి కార్యాచరణ రూపొందించాలని పిలుపునిచ్చారు. ప్రాంత ప్రయోజనాలను విస్మరించే నాయకులకు ప్రజలు రాజకీయంగా తగిన గుణపాఠం చెప్పే స్థాయికి ఎదగాలని బొజ్జ దశరథ రామిరెడ్డి సూచించారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.