Nandyal: నందికోట్కూరు మున్సిపల్ పోరు..అభ్యర్థుల ఎంపికపై తొలగని ప్రతిష్టంభన!
Nandyal: నందికోట్కూరు మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో అభ్యర్థుల ఎంపికపై టీడీపీ కూటమి, వైఎస్సార్సీపీలలో తీవ్ర ప్రతిష్టంభన నెలకొంది.
Nandyal: నందికోట్కూరు మున్సిపల్ పోరు..అభ్యర్థుల ఎంపికపై తొలగని ప్రతిష్టంభన!
Nandyal: నంద్యాల జిల్లా నందికోట్కూరు పురపాలక సంఘం ఎన్నికల నగారా మోగింది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయి గెజిట్ విడుదలైనా, ప్రధాన పార్టీలలో అభ్యర్థుల ఎంపికపై నెలకొన్న ప్రతిష్టంభన మాత్రం ఇంకా తొలగలేదు. ఖరారు కాని అభ్యర్థుల జాబితా తో క్షేత్రస్థాయిలో కార్యకర్తల్లో అయోమయం నెలకొంది.
రిజర్వేషన్ తో పెరిగిన పోటీ:
ఈసారి నందికోట్కూరు మున్సిపల్ చైర్మన్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ కావడం రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేసింది. గతంలో ఓ.సి గా ఉన్న ఈ పదవి ఇప్పుడు బీసీ మహిళకు కేటాయించడంతో ఆయా సామాజిక వర్గాల్లో ఆశావహుల సంఖ్య భారీగా పెరిగింది. ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళా నేతలు, వారి కుటుంబ సభ్యులు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 36,700 మందికి పైగా ఓటర్లు, 32 వార్డులు ఉన్నాయి. ఈసారి చైర్మన్ పదవికి నేరుగా ప్రజలే ఎన్నుకోనుండటంతో ఈ పదవి ప్రాధాన్యత మరింత పెరిగింది. చైర్మన్ అభ్యర్థి ఎవరనేదానిపై ఆధారపడే, వార్డుల్లో గెలుపోటములు ఉంటాయని అన్ని పార్టీలు భావిస్తున్నాయి.
అధికార కూటమిలో ముగ్గురి మధ్య పంచాయితీ:
అధికార కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) లో సీట్ల సర్దుబాటు పెద్ద తలనొప్పిగా మారింది. చైర్మన్ పదవి తమకే కావాలని మూడు పార్టీల నేతలు పట్టుబడుతున్నారు. టీడీపీ నుండి ఇద్దరు, జనసేన నుండి ఒకరు బలమైన పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది.
అంతర్గతంగా ఎంపీ బైరెడ్డి శబరి , ఎమ్మెల్యే గిత్త జయసూర్య లు తమ వర్గానికి చెందిన వారికే ప్రాధాన్యతనివ్వాలి అని ఇంచార్జి మంత్రి వద్ద పట్టుబడుతూ ఉండటం ఈ ప్రతిష్టంభనకు కారణంగా చెప్పవచ్చు. ఏది ఏమైనా వీరిరువురి మధ్య ఏకాభిప్రాయం కుదిరి కూటమిలో భాగస్వాములైన జనసేన,బి. జె. పి పార్టీల జాబితాలను కూడా పరిగణలోకి తీసుకుని తుది జాబితాతో ప్రజల్లోకి వెళ్లాలని కోరుకుందాం.
చైర్మన్ పదవిని ఒక పార్టీకి ఇస్తే, మిగిలిన 32 వార్డుల్లో మిగతా పార్టీలకు ఎలా సర్దుబాటు చేయాలనే దానిపై కూటమి అధిష్టానం తర్జనభర్జనలు పడుతోంది. ఈ లోపు ద్వితీయ శ్రేణి నాయకులు సోషల్ మీడియాలో తమ పేర్లను తెరపైకి తెస్తూ, తమకు టికెట్ ఖాయమంటూ స్వయంగా ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో అసలు అభ్యర్థి ఎవరో కార్యకర్తలకే అర్థం కాని పరిస్థితి నెలకొంది.
వైసీపీలో సిద్ధార్థ్ రెడ్డి కసరత్తు:
మరోవైపు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే పరిస్థితిలో ఉంది. వ్యూహరచనలో భాగంగా రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ దారా సుధీర్ లు వరుస సమాలోచనలు జరుపుతున్నారు.దాదాపుగా చైర్మన్ అభ్యర్థిని మినహా మిగతా అభ్యర్థుల ఎంపిక దాదాపుగా పూర్తి చేసినట్లుగా సమాచారం.
బీసీ మహిళా రిజర్వేషన్ రావడంతో పార్టీకి అనుకూలంగా ఉన్న బీసీ ఓటు బ్యాంకును నిలబెట్టుకోవాలంటే బలమైన, ఆర్థికంగా బలం ఉన్న అభ్యర్థిని బరిలోకి దింపాలని వారు భావిస్తున్నారు. అయితే మొదటి నుంచి పార్టీలో ఉంటూ టికెట్ ఆశించి ,దక్కని వారిని ఎలా
బుజ్జగిస్తారో వేచి చూడక తప్పని పరిస్థితి .
తొలగని ప్రతిష్టంభనకు కారణం ఏంటి?
నేరుగా ఎన్నిక: గతంలో కౌన్సిలర్ల ద్వారా చైర్మన్ ఎన్నిక జరిగేది. ఇప్పుడు ప్రజలే నేరుగా ఎన్నుకుంటారు కాబట్టి, పరపతి ఉన్న వ్యక్తి కావాలి.
ఆర్థిక భారం: మున్సిపల్ ఎన్నికలకు భారీగా ఖర్చు అవుతుంది. పార్టీ ఫండ్ తో పాటు సొంతంగా ఖర్చు పెట్టగల అభ్యర్థి కోసం వెతుకులాట.
సామాజిక సమీకరణాలు: బీసీ మహిళలో ఏ కులానికి ఇస్తే ఎక్కువ ఓట్లు వస్తాయనే లెక్కలు.
క్రాస్ ఓటింగ్ భయం.చైర్మన్ అభ్యర్థి ఎన్నిక ప్రత్యక్షంగా ఉండటం.
మొత్తానికి, నామినేషన్ల గడువు దగ్గర పడుతున్నా, అభ్యర్థుల ఎంపికలో తొలగని ప్రతిష్టంభన కారణంగా నందికోట్కూరు రాజకీయం రసవత్తరంగా మారింది. అధిష్టానం ఎవరిని బరిలోకి దింపుతుందో అనే ఉత్కంఠ క్షేత్రస్థాయిలో నెలకొంది.




