Nandikotkur: నందికొట్కూరులో డ్రై పోర్టు ఏర్పాటు చేయాలి!

Nandikotkur: నందికొట్కూరులో డ్రై పోర్టు, ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ మార్కెట్ ఏర్పాటు చేయాలని మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి కలెక్టర్‌కు ప్రతిపాదన సమర్పించారు.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)
Published on: 25 Sept 2026 6:34 PM IST
Nandikotkur
X

Nandikotkur: నందికొట్కూరులో డ్రై పోర్టు ఏర్పాటు చేయాలి!

Nandikotkur: నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి, రైతులకు మెరుగైన మార్కెట్ సౌకర్యాలు కల్పించేందుకు ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ మార్కెట్, డ్రై పోర్టు ఏర్పాటు చేయాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వీరం ప్రసాద రెడ్డి కోరారు. ఈ మేరకు నంద్యాల జిల్లా కలెక్టర్‌కు ప్రతిపాదన సమర్పించారు.

నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలో సుమారు 1,600 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని, ఇది NH-340Cకు సమీపంలో ఉండటంతో పాటు ఓర్వకల్లు విమానాశ్రయం, కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానానికి అనుకూలంగా ఉందని తెలిపారు. ఈ ప్రాంతంలో సమగ్ర వ్యవసాయ మార్కెట్, డ్రై పోర్టు ఏర్పాటు చేస్తే రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.

ప్రతిపాదిత మార్కెట్‌లో పంటల ఆరబెట్టే ప్లాట్‌ఫారాలు, నూర్పిడి యార్డులు, రైపెనింగ్ చాంబర్లు, కోల్డ్ స్టోరేజీలు, గిడ్డంగులు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే వ్యవసాయ ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు తరలించేందుకు అనువైన ఇంటిగ్రేటెడ్ డ్రై పోర్టు టెర్మినల్ ఏర్పాటు చేయాలని కోరారు.

ఇలాంటి మౌలిక వసతులు అందుబాటులోకి వస్తే పంటల కోత అనంతర నష్టాలను తగ్గించడంతో పాటు రైతులకు మెరుగైన ధర లభించే అవకాశం ఉంటుందని వీరం ప్రసాద రెడ్డి తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ, రవాణా, మార్కెటింగ్ సదుపాయాలు మెరుగుపడి, స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని పేర్కొన్నారు.

పొలం నుంచి మార్కెట్‌కు.. మార్కెట్ నుంచి పోర్టుకు వ్యవసాయ ఉత్పత్తుల రవాణాను సులభతరం చేసేలా సంబంధిత శాఖలతో సమన్వయం చేసి, ముందుగా సమగ్ర సాధ్యాసాధ్యాల అధ్యయనం (ఫీజిబిలిటీ స్టడీ) చేపట్టాలని కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)

Iman Raju, Nandikotkur(Kurnool Dist)