Nandyal: బాలికల విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట!

Nandyal: నంద్యాల జిల్లా అవుకు కేజీబీవీలో రూ.1.67 కోట్లతో నిర్మించిన నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి.

Ramanaiah, Banaganepalle
Published on: 3 Oct 2026 2:14 PM IST
Nandyal
X

Nandyal: బాలికల విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట!

Nandyal: బాలికలకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు, వారికి అవసరమైన అన్ని మౌలిక వసతులను సమకూర్చడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు. విద్యా రంగాన్ని బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా అవుకు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో రూ.1.67 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు మంత్రి నారా లోకేష్ ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ, విద్యార్థినులకు మెరుగైన తరగతి గదులు, సౌకర్యవంతమైన విద్యా వాతావరణం అందించేలా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు.

విద్యే సమాజ అభివృద్ధికి బలమైన పునాది

ప్రతి విద్యార్థినికి సమాన అవకాశాలు, నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక వసతులు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. ముఖ్యంగా బాలికల విద్యకు ప్రోత్సాహం అందించడం ద్వారా వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయడంతో పాటు, రాష్ట్ర అభివృద్ధిలో వారిని భాగస్వాములను చేయడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు.

ప్రభుత్వ విద్యాసంస్థల్లో అవసరమైన మౌలిక వసతులను దశలవారీగా అభివృద్ధి చేస్తూ విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పిస్తామని మంత్రి స్పష్టం చేశారు. విద్యా రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యానికి అవుకు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో నూతన భవనం నిర్మాణం ఒక ఉదాహరణగా నిలుస్తుందని పేర్కొన్నారు.

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle