Kodumuru: ఆర్టీసీపై చెరగని అభిమానం.. రిటైర్డ్ డ్రైవర్ సేవలు భేష్!

Kodumuru: కోడుమూరు బస్టాండ్‌లో సొంత ఖర్చులతో రోడ్డు గుంతలు పూడ్చి, మౌలిక వసతులు కల్పిస్తున్న ఆర్టీసీ రిటైర్డ్ డ్రైవర్ వెంకటేశ్వర్లు. స్థానికుల ప్రశంసలు.

C. Ganesh, Kodumuru
Published on: 24 Oct 2026 5:43 PM IST
Kodumuru
X

Kodumuru: ఆర్టీసీపై చెరగని అభిమానం.. రిటైర్డ్ డ్రైవర్ సేవలు భేష్!

కోడుమూరు: ఉద్యోగ విరమణ చేసినప్పటికీ ఆర్టీసీ సంస్థపై తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ సేవలందిస్తున్న రిటైర్డ్ ఉద్యోగి వెంకటేశ్వర్లు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కర్నూలు జిల్లా చనుగొండ్ల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు గతంలో ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. అనంతరం రిటైర్డ్ ఉద్యోగులకు తాత్కాలికంగా కంట్రోలర్‌గా విధులు నిర్వహించే అవకాశం కల్పించడంతో కోడుమూరు బస్టాండ్‌లో కంట్రోలర్‌గా సేవలందిస్తున్నారు.

తన కుటుంబానికి జీవనాధారం కల్పించిన ఆర్టీసీ సంస్థకు తన వంతు సేవ చేయాలనే సంకల్పంతో వెంకటేశ్వర్లు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. బస్టాండ్‌లోకి వచ్చే మార్గంలో ఏర్పడిన పెద్ద గుంతను తన సొంత డబ్బులతో మట్టి తోలించి పూడ్చివేశారు. అలాగే, దాత ఎద్దుల మహేశ్వరరెడ్డి సహకారంతో కంట్రోలర్ గదికి గ్రిల్ ఏర్పాటు చేయించారు.

రాత్రి వేళల్లో బస్టాండ్ ప్రాంగణంలో చీకటి లేకుండా ఉండేందుకు గ్రామపంచాయతీ సహకారంతో లైట్లు ఏర్పాటు చేయించడంలోనూ చొరవ చూపారు. ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడంతో పాటు బస్టాండ్ పరిసరాల అభివృద్ధికి కృషి చేస్తున్న వెంకటేశ్వర్లు సేవలను స్థానికులు, ప్రయాణికులు అభినందిస్తున్నారు. ఉద్యోగ విరమణ అనంతరం కూడా తాను పనిచేసిన సంస్థపై అభిమానంతో సేవలందించడం ఆదర్శనీయమని పలువురు ప్రశంసిస్తున్నారు.

C. Ganesh, Kodumuru

C. Ganesh, Kodumuru