Kurnool: కర్నూలులో 10 లక్షల బ్యాలెట్ పత్రాల ముద్రణ

Kurnool: కర్నూలు నగరపాలక సంస్థ ఎన్నికల కోసం 10 లక్షల బ్యాలెట్ పత్రాల ముద్రణకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 19 Oct 2026 4:42 PM IST
Kurnool
X

Kurnool: కర్నూలులో 10 లక్షల బ్యాలెట్ పత్రాల ముద్రణ

కర్నూలు: కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ పత్రాల ముద్రణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు ఆదేశించారు. సోమవారం పాత బస్టాండ్, కొత్త బస్టాండ్ ప్రాంతాల్లోని ప్రింటింగ్ ప్రెస్‌లను పరిశీలించారు. మేయర్, కార్పొరేటర్ అభ్యర్థులకు సంబంధించి మొత్తం 10 లక్షల బ్యాలెట్ పత్రాల ముద్రణకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం స్థానిక ఎస్బీఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సంస్థ సమావేశ భవనంలో ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా చల్లా ఓబులేసు మాట్లాడుతూ.. కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో 4,79,861 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ప్రతి ఓటరు మేయర్ అభ్యర్థికి ఓటు వేసేందుకు ఒక బ్యాలెట్ పత్రం, కార్పొరేటర్ అభ్యర్థికి ఓటు వేసేందుకు మరో బ్యాలెట్ పత్రం వినియోగించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వీటికి అదనంగా పోలింగ్ కేంద్రాల్లో 10 శాతం బ్యాలెట్ పత్రాలను అందుబాటులో ఉంచాల్సి ఉంటుందన్నారు.

ఈ నేపథ్యంలో దాదాపు 10 లక్షల బ్యాలెట్ పత్రాల ముద్రణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ముద్రణ ప్రక్రియలో పూర్తి గోప్యత పాటిస్తూ, బ్యాలెట్ పత్రాల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రింటింగ్ ప్రెస్ కేంద్రాల వద్ద అనధికార వ్యక్తులు ప్రవేశించకుండా తగిన చర్యలు తీసుకోవాలని, పోలీసు శాఖతో సమన్వయం చేసుకుని పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ప్రింటింగ్ ప్రెస్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, బారికేడ్లు ఏర్పాటు చేసి భద్రతను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఆఖరి బ్యాలెట్ పత్రం ముద్రణ పూర్తయ్యే వరకు నిర్విరామంగా ముద్రణ ప్రక్రియ కొనసాగించాలని తెలిపారు. ముద్రించిన బ్యాలెట్ పత్రాల లెక్కింపు, భద్రపరచడం, తరలింపు ప్రక్రియలను ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.

అదేవిధంగా అథెనా స్కూల్‌లో ఏర్పాటు చేస్తున్న కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. పోలింగ్‌కు ముందు రోజు ప్రిసైడింగ్ అధికారులకు ఎన్నికల సామగ్రి పంపిణీ చేసేందుకు అవసరమైన రిసెప్షన్ ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం కౌంటింగ్ కేంద్రంలో అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్.జి.వి. కృష్ణ, ఎస్‌ఈ రమణమూర్తి, ఎంఈలు మనోహర్ రెడ్డి, గిరిరాజ్, డీసీపీ శబ్నం శాస్త్రీ, కార్యదర్శి నాగరాజు, ఆర్వో వాజిద్, డీఈఈలు నరేష్, పవన్ కుమార్ రెడ్డి, కృష్ణలత, శ్రీనివాసన్, ఎలక్ట్రికల్ సూపర్వైజర్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL